15న అల్బెండజోల్, డి.ఇ.సి మాత్రల పంపిణీ


Ens Balu
13
Parvathipuram
2023-02-13 09:35:27

పార్వతీపురం మన్యం  జిల్లాలో అల్బెండజోల్, డి ఇథైల్ కార్భమజైన్ సిట్రెట్ (డి.ఇ.సి) మాత్రల పంపిణీ కార్యక్రమం ఈ నెల 15వ తేదీన జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. నులిపురుగులు, ఏలిక పాముల నివారణకు, తద్వారా సంభవించే రక్త హీనత నివారణకు అల్బెండజోల్, డి.ఇ.సి మాత్రలు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. సోమ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా అల్బెండజోల్, డి.ఇ.సి మాత్రల పంపిణీపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మందుల పంపిణీ పక్కాగా జరగాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. 15వ తేదీన మందులు తీసుకోని వారికి 16, 17 తేదీల్లో పంపిణీ జరుగుతుందని ఆయన వివరించారు.

2 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు వంద మిల్లీ గ్రాముల  డి.ఇ.సి మాత్ర ఒకటి, నాలుగు వందల మిల్లీ గ్రాముల అల్బెండజోల్ మాత్ర ఒకటి పంపిణీ చేయాలని ఆయన సూచించారు. 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు రెండు వందల మిల్లీ గ్రాముల డి.ఇ.సి మాత్రలు రెండు, నాలుగు వందల మిల్లీ గ్రాముల అల్బెండజోల్ మాత్ర ఒకటి పంపిణీ చేయాలని, 15 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి మూడు వందల మిల్లీ గ్రాముల  డి.ఇ.సి మాత్ర మూడు, నాలుగు వందల మిల్లీ గ్రాముల అల్బెండజోల్ మాత్ర ఒకటి పంపిణీ చేయాలని ఆయన సూచించారు. పాఠశాలలలో శత శాతం మాత్రలు పంపిణీ జరుగుటకు జిల్లా విద్యా శాఖ అధికారి అందరు ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయాలని, అంగన్వాడీ, వసతి గృహాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, మున్సిపాలిటీలలో శత శాతం మాత్రలు పంపిణీ జరుగుటకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు మాట్లాడుతూ రెండు సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రలు వేయరాదని అన్నారు. ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే మాత్రలు వేయాలని, ఖాళీ కడుపుతో మాత్రలు తీసుకోరాదని ఆయన పేర్కొన్నారు. మాత్రల వలన ప్రయోజనం కలుగుతుందని, దుష్ప్రభావాలు ఉండవని చెప్పారు. మాత్రలు వేసుకొన్న అనంతరం ఆరోగ్యంలో మార్పులు, అస్వస్థత కలుగుతున్నట్లు సందేహం కలిగితే వెంటనే దగ్గరలోని వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్ అధికారి సి. విష్ణు చరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.