ఉపాధ్యాయుల గైర్హాజరుపై చర్యలు చేపట్టండి
Ens Balu
24
Paderu
2023-02-13 13:15:16
అల్లూరి జిల్లాలో పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి వారిని జాతికి అంకితం చేయాల్సిన ఉపాధ్యాయులే విధులకు డుమ్మా కొడుతూ స్వంత పనులు చక్కపెట్టుకుంటున్నట్టు ఆధారాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు కోకొల్లలుగా ఫిర్యాదులు అందుతున్నాయని ఇటువంటి వారిని చూస్తూ ఉపేక్షించేది లేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, కుమారి ఆదిలక్ష్మి త్రిపర్ణ అన్నారు. సోమవారం జిల్లా విద్యా శాఖాధికారులతో పాడేరు కాఫీ హౌస్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సభ్యులు సీతారాం మాట్లాడుతూ, డ్రాప్ ఔట్లు జిల్లాలో ఎంతమంది ఉన్నారు, గుర్తించిన రికార్డులపై ఆరా తీశారు, వారిని చేర్పించిన పాఠశాలల వివరాలు, వారిని పర్యవేక్షిస్తున్న అధికారులు గురించి అడిగి తెలుసుకున్నారు. డుమ్మా కొడుతూ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు త్వరిత గతిన నివేదిక సమర్పించాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీచేశారు.
అదేవిధంగా బాలలను మత్తు పదార్థాలు, వ్యసనాలకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టేలా ప్రణాళికా యుతంగా వ్యవహరించాలన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు గిరిజన సంక్షేమ శాఖ, పోలీసు శాఖ, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ, ఎక్సైజ్ శాఖ, డ్రగ్ కంట్రోల్, జిల్లా విద్యాశాఖాధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్త్రీ శిశు సంక్షేమ, తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలల, విద్యార్థుల జీవితాలను చిద్రం చేస్తున్న మత్తు పదార్థాలు, బాలల అక్రమ రవాణా వ్యవహారాలపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ డేగ కళ్ళతో పర్యవేక్షణ జరుపుతోందన్నారు. వీటికి దూరంగా ఉంచుతూ వారి బంగారు భవితకు ఎటువంటి చర్యలు తీసుకుంటే వాటిని విడనాడి పయనిస్తారో ఆయా అంశాలను ప్రభుత్వానికి, జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు, సూచనలు రూపంలో అందిస్తున్నామని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యురాలు ఎం.రజనీ, ఐసిడిఎస్. పిడి ఎన్.సూర్య లక్ష్మి, సిడిపిఓలు, జిల్లా విద్యా శాఖాధికారి డా. పి. రమేష్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఐ.కొండల రావు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎల్. రజని, పిఒడిటిటి డా. భారతి, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా కన్వీనర్ లవకుశ ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.