పారదర్శకంగా సేవలందాలి..


Ens Balu
3
Srikakulam
2020-09-25 18:38:55

గ్రామసచివాలయాల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించడంలో పారదర్శకంగా పనిచేయాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు సచివాలయ సిబ్బందినిఆదేశించారు.నగరంలోని  కంపోస్టు కాలనీలోని సచివాలయాన్ని సంయుక్త కలెక్టర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా సచివాలయం నుండి అందుతున్న సేవలను పరిశీలించిన ఆయన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, ఇతర సమాచారం, లబ్ధిదారుల జాబితాలు ప్రజల పరిశీలనార్ధం ప్రదర్శించినదీ? లేనిదీ? గమనించారు. కోవిడ్ నేపధ్యంలో వాలంటీర్లు, ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది చేపట్టిన ఫీవర్ సర్వేపై ఆరా తీసారు. సర్వేలో ఏ ఒక్కరిని విడిచి పెట్టరాదని తద్వారా కోవిడ్ ను నిర్మూలించవచ్చని సంయుక్త కలెక్టర్ స్పష్టం చేసారు. కోవిడ్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని సూచిస్తూ,  అనారోగ్యం బారిన ఉన్నవారు ఏ ఒక్కరూ ఇంటివద్ద లేకుండా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందని పేర్కొన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజలకు మంచి సేవలు అందించడమే పరమావధి అని, తద్వారా సంతృప్తి కలుగుతుందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డు, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డు అందించడంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ నాలుగు అవసరాలకు ఎక్కువ మంది సచివాలయానికి వస్తారని వారికి మెరుగైన సేవలు అందించి పంపించాలని, ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో సేవలు అండాల్సిందేనని జె.సి తేల్చిచెప్పారు. ప్రతి పథకానికి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారిని గుర్తించాలని అటువంటి జాబితాను సచివాలయం వద్ద ప్రదర్శించాలని,పథకాల అమలులో  పారదర్శకత స్పష్టంగా ఉండాలని అదే ప్రభుత్వ విధానమని ఆయన వివరించారు. ప్రజలకు అవసరమైన సేవలు వారి వద్దకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని,  సచివాలయాల ఏర్పాటు అందులో భాగమేనని అన్నారు. యువతగా అద్భుతమైన పనితీరు కనిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.