ధార్మిక ప్రాజెక్టుల కార్యకలాపాలపై టిటిడి ఈవో సమీక్ష


Ens Balu
21
Tirupati
2023-02-17 14:19:25

ధార్మిక ప్రాజెక్టుల కార్యకలాపాలపై టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం జెఈవో  సదా భార్గవితో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కార్యకలాపాలను తెలియజేశారు. ధార్మిక కార్యక్రమాలతో వార్షిక క్యాలెండర్‌ను రూపొందించాలని ఈవో సూచించారు.  అనంతరం మనగుడి, కల్యాణమస్తు, గుడికో గోమాత, అష్టాదశపురాణాలు, అన్నమాచార్య సంకీర్తనలు, దాసపదాలు, ఆళ్వార్ల సాహిత్యం, చతుర్వేద హవనాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

అయా ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, నియామకాలు, చెల్లింపులు, కళాకారుల సమస్యలపై వేరువేరుగా సమీక్షలు నిర్వహించి త్వరితగతిన పరిష్కరించాలని జెఈవోకు ఈవో సూచించారు. ఈ సమీక్షలో ధార్మిక ప్రాజెక్టుల అధికారి  విజయలక్ష్మి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. విభీషణశర్మ, హెచ్‌డిపిపి ఏఈవో  శ్రీరాములు, ప్రోగ్రాం అధికారి  విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.