ఔత్సహిక పారిశ్రామికవేత్తల అభ్యున్నతికి పెద్దపీట


Ens Balu
12
Rajamahendravaram
2023-02-17 14:42:21

మహిళా, ఔత్సహిక పారిశ్రామికవేత్తలను అభ్యున్నతికి, తద్వారా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత పేర్కొన్నారు.  శుక్రవారం సాయంత్రం స్థానిక  జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు,  అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్   సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  జిల్లాలో ఏప్రిల్ 4 వ తేదికి జిల్లా ఏర్పాటై ఏడాది సంవత్సరం పూర్తి కానున్న దృష్ట్యా 50 మంది  మహిళా పారిశ్రామిక వేత్తలకు యూనిట్స్ ఏర్పాటుకు బ్యాంకర్స్ రుణాలు మంజూరు  చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యాలన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి దశలో 200 మంది మహిళా  పారిశ్రామికవేత్తలను ఎంపిక చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి అడుగులు పడ్డాయన్నారు.  మార్చి, 2023 చివరి నాటికి మరో 1500 మందికి ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆ దిశలో ఇప్పటివరకు  ప్రధాన మంత్రి మహిళ ప్రోత్సాహ షెడ్యూల్ ప్రకారం, 206 మంది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించామన్నారు.

మొదటి విడతగా పరిశీలన అనంతరం 75 యూనిట్స్ బ్యాంకర్స్ రుణాలు మంజూరు చేయడం జరుగుతొందన్నారు.  జిల్లాలో ఇప్పటివరకు  ఎంఎస్ఎంఇ ప్రోగ్రాం క్రింద  2861 యూనిట్లకు గాను రూ. 474.89 కోట్లు పెట్టుబడి  నిధి అందించగా 11741 మందికి ఉపాధికి అవకాశాలు లభించాయన్నారు.  జిల్లాలో మరో 3 భారీ పరిశ్రమలు ఏర్పాటుకు గాను రూ. 1660 కోట్లతో నిర్మించునున్న పరిశ్రమలో వివిధ దశల్లో ఉన్నాయని ఈ పరిశ్రమల వలన 2691 మంది కి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమలు  కొవ్వూరు మండలం పంగిడిలో  సోలార్ గ్లాస్, నల్లజర్ల మండలం పోతవరంలో బయోటెక్నాలజీ, గోకవరం మండలం గుమ్మలదొడ్డి లో ఇన్ ఆర్గానిక్ కెమికల్స్ కంపెనీల పనులు  వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.  జిల్లాలో క్లస్టర్ అభివృద్ధి ప్రోగ్రాం కింద  రూ.15 కోట్ల ప్రతిపాదనతో 140 ఫర్నిచర్ క్లస్టర్ యూనిట్లు ఏప్రిల్ 2023 నాటికి ప్రారంభించినట్లు తెలిపారు.

 2022 - 23  సంవత్సరానికి గాను జిల్లాలో సిలికాన్ కార్బన్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ రాజమహేంద్రవరం వారిచే  27 యూనిట్లకు గాను రూ. 28 కోట్లు, గోదావరి సర్మిక్ అండ్ రీ ఫ్యాక్టరీ అసోసియేషన్ ధవలేశ్వరం వారు 25 యూనిట్లకు గాను రూ 10 కోట్లు మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని  పేర్కొన్నారు.  ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ గా  జిల్లాలో ఇప్పటివరకు డిఐసి, ఏపీకే విఐబి, కెవిఐసి క్రింద 611 దరఖాస్తులు రాగా 275 యూనిట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటివరకు 192 యూనిట్లు గ్రౌండ్లింగ్ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని పరిశ్రమల స్థాపన దిశగా ఔత్సహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహం అందించాలని స్పష్టం చేశారు.  సమావేశంలో పరిశ్రమల శాఖ కే. వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ పి . ప్రదీప్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్, డిపిఓ పి. జగదాంబ, మైక్రో ఇరిగేషన్ అధికారి కె. శ్రీనివాసరావు, డిసిఐఎఫ్, ఏపీఐఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు.