నిరుద్యోగులకు ప్రైవేటు ఉద్యోగాలు..


Ens Balu
2
Srikakulam
2020-09-25 19:59:06

శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.నగేష్  శుక్రవారం తెలిపారు. సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ( సిదాప్ ), డిఆర్డీఏ వారి ద్వారా హైదరాబాద్ లోని హనర్ ల్యాబ్, నెల్లూరులోని శ్రీసిటీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీ నందు పనిచేయుటకు ఎంపిక  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న ఉద్యోగ నియామక ఎంపిక కార్యక్రమం ఉదయం 9.30గం.ల నుండి మధ్యాహ్నం 1.00గం.వరకు ఉంటుందని తెలియజేసారు. సెప్టెంబర్ 30న  సోంపేట, అక్టోబర్ 13న పలాస , 20న టెక్కలి, 27న నరసన్నపేట మండల మహిళా సమైక్య కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు.  అలాగే నవంబర్ 6న శ్రీకాకుళం, జిల్లా మహిళా సమైక్య కార్యాలయంలోనూ, 16న ఆమదాలవలస మండల మహిళా సమైక్య కార్యాలయంలోనూ, 21న  ఎచ్చెర్ల, 23న రాజాం, 27న పాలకొండ మరియు 29న పాతపట్నం మండల మహిళా సమైక్య కార్యాలయంల్లో ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహించ నున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.  హైదరాబాద్ హనర్ ల్యాబ్ లో పని చేయుటకు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రూ.20వేలు, బియస్సి అభ్యర్థులకు రూ.17,500 వేతనంతో పాటు కంపెనీ నిబంధనల మేరకు  భోజన వసతి కల్పించబడుతుందని  పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో గల గ్రీన్ టెక్ ఇండస్ట్రీలో పని చేయుటకు 2017-2019 సం.లో పాసైన బీటెక్ మెకానికల్ పురుష అభ్యర్ధులతో పాటు పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమాలలో పాసైన పురుష అభ్యర్థులకు రూ. 10 వేల నుండి రూ.12 వేల జీతంతో పాటు  భోజన వసతి సదుపాయం ఉంటుందని అన్నారు.  శ్రీసిటీ నందు గల మొబైల్ తయారీ కంపెనీ లో పని చేయుటకు పదో తరగతి పాసై 18 సం.లు నిండిన మహిళా అభ్యర్థులకు  రూ. 10 వేల జీతంతో పాటు భోజన వసతి సౌకర్యం కల్పించబడునని  చెప్పారు.  ఆసక్తి గల అభ్యర్ధులు పై తేదీలలో పైన పేర్కొన్న వేదిక వద్దకు హాజరుకావాలని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. ఇంటర్వ్యూకి హాజరగు అభ్యర్థులు తమయొక్క విద్యార్హతల ధృవపత్రాలతో పాటు  బయోడేటా, ఆధార్ కార్డ్ తో  హాజరుకావాలని స్పష్టం చేసారు.