నాడు-నేడు పనులు సత్వరం పూర్తికావాలి..
Ens Balu
4
Vizianagaram
2020-09-25 20:18:34
విజయనగరం జిల్లాలో నాడు-నేడు పనులను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పనులపై కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంఇఓలు, ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా పనుల స్థితిగతులపై మండలాల వారీగా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెసి మహేష్‌కుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులు నాడూ-నేడు పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎం-బుక్ నిర్వహణలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పూర్తయిన పనులను ఫొటోలతో సహా అప్‌లోడ్ చేయాలని సూచించారు. అలాగే సిమ్మెంటు తీసుకున్నవారు, వాటి ఇన్‌వాయిలను అప్‌లోడ్ చేసినప్పుడు మాత్రమే బిల్లు చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెండింగ్ ఉన్నవారంతా, వినియోగించిన సిమ్మెంటు వివరాలను వెంటనే అప్‌లోడ్ చేయాలని సూచించారు. సాంకేతిక సమస్యలతో పనులను పెండింగ్‌లో ఉంచడం సరికాదని, శుక్రవారం సాయంత్రం లోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలన్నిటినీ తక్షణమే పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉందని, భవిష్యత్తులో ఇవి కొనసాగకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో డిఇఓ జి.నాగమణి, వివిధ ఇంజనీరింగ్ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎంఇఓలు తదితరులు పాల్గొన్నారు.