నిజాయితీగా సేవలు అందించండి..
Ens Balu
4
Vizianagaram
2020-09-25 20:22:51
గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేసే అవకాశం లభించడం ద్వారా గ్రామీణ ప్రజలకు సేవచేసేందుకు యువతకు మంచి అవకాశం లభించిందని దీనిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను అందించడంలో నిజాయితీగా పనిచేసి ఈ వ్యవస్థకు మంచిపేరు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు సచివాలయ సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ప్రారంభించిందని, దీనిని విజయవంతం చేయడమనేది ఇందులో పనిచేసే సిబ్బందిపైనే ఆధారపడి వుంటుందన్నారు. దేశవ్యాప్తంగా అంతా మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థవైపు చూస్తున్నారని, దేశానికి ఇది ఒక ఆదర్శ నమూనాగా రూపొందించేందుకు సిబ్బంది కృషిచేయాలన్నారు. జె.సి.వెంకటరావు శుక్రవారం గంట్యాడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటనలో భాగంగా మండలంలోని పెదమజ్జిపాలెంలో గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడి సిబ్బందితో సమావేశమయ్యారు. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ముఖ్యమైన పథకాల సమాచారం, ముఖ్యమైన ఫోన్ నెంబర్లు సచివాలయంలో ప్రదర్శించినదీ లేనిదీ పరిశీలించారు. సచివాలయంలో ఉన్న రిజిస్టర్లను తనిఖీ చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న సచివాలయ నూతన భవనాన్ని పరిశీలించారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో వున్న గ్రామ సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలను పరిశీలించారు. సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి వాటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రామవరం, తామరాపల్లి, కర్లాంలో గ్రామ సచివాలయ భవనాలు, గంట్యాడ మండల కేంద్రంలో సచివాలయ భవనం, రైతుభరోసా కేంద్ర భవనాలను, సిరిపురం, నరవల్లో సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్ర భవనాలను పరిశీలించారు. ఈ పర్యటనలో తహశీల్దార్ స్వర్ణకుమార్, ఎంపిడిఓ నిర్మలాదేవి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.