నగదు, మద్యం అక్రమ తరలింపుపై నిఘాపెంచాలి
Ens Balu
20
Bapatla
2023-02-21 08:01:58
నగదు, మద్యం అక్రమ తరలింపులు అరికట్టడానికి మండలాల సరిహద్దులలో స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాల నిఘా పెంచాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ఆదేశించారు. శాసనమండలి ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఆయా కమిటీల్లోని అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున నగదు, మద్యం పంపిణీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ తెలిపారు. ఇతర ప్రాంతాలనుంచి నగదు, మద్యం ఆయా మండలాలలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. అక్రమ తరలింపులు అరికట్టడానికి పోలీసులు సూచించిన రహదారుల వద్ద 24 గంటలపాటు నిఘా ఉంచేలా స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాలు పనిచేయాల్సి ఉందన్నారు. ఆ బృందాలు గుర్తించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎన్నికల కంట్రోల్ రూమ్ కి చేరవేయాలన్నారు.
శాసనమండలి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండురోజుల్లో ముగుస్తున్నందున అభ్యర్థుల ప్రచారం మొదలయ్యే అవకాశం ఉందన్నారు. అభ్యర్థుల ప్రచారానికి వినియోగించే కరపత్రాలు, ఇతర సామాగ్రిని పరిశీలించాలన్నారు. కరపత్రాలు, సమావేశాలకు అనుమతులపై ప్రత్యేక పరిశీలన ఉండాలన్నారు. ఒకే ప్రాంతంలో రెండు రాజకీయ పార్టీల అభ్యర్థులు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమిటీల దృష్టికి వస్తే తక్షణమే కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వాలన్నారు. ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని అరికట్టాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా కమిటీలోని అధికారులు పర్యవేక్షించాలని డాక్టర్ శ్రీనివాసులు చెప్పారు. ముఖ్యంగా సెక్టోరల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సమర్థంగా పనిచేయాలన్నారు.
ఎన్నికల విధుల నిర్వహణపై పూర్తిస్థాయిలో శిక్షణలు ఇవ్వాలన్నారు. చీరాల సహాయ రిటర్నింగ్ అధికారి, ఆర్.డి.ఓ. సరోజిని నుంచి బ్యాలెట్ బాక్సులను సంబంధిత అధికారులు రెండురోజుల్లో తెచ్చుకోవాలన్నారు. వాటిని ఎన్నికలకోసం సిద్ధం చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ కోసం అవసరమైన ప్రింటింగ్ ప్రెస్ లను గుర్తించాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో నిర్లిప్తత ఉండరాదన్నారు. ఎన్నికల కమిషన్ ఆధీనంలో పనిచేస్తున్న విషయాలను అధికారులు గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారిణి కె.లక్ష్మీశివజ్యోతి, నోడల్ అధికారులు, వివిధ కమిటీలలోని అధికారులు, ఆయా మండలాల నుంచి మండలస్థాయి కమిటీలలోని అధికారులు, తదితరులు పాల్గొన్నారు.