నెలాఖరుకి బ్యాంకు ఖాతాలు తెరవాలి..
Ens Balu
4
Vizianagaram
2020-09-25 20:30:11
విజయనగరం జిల్లాలో అర్హులందరికీ జన్‌ధన్ ఖాతాలను తెరవాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ కోరారు. ఖాతాలను తెరిచే ప్రక్రియను ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. తన ఛాంబర్‌లో శుక్రవారం సాయంత్రం బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో వైఎస్ఆర్ బీమా పథకం నమోదుకు బ్యాంకు ఖాతా తప్పనిసరి అని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో సుమారు 29,000 మందికి వ్యక్తిగతంగా బ్యాంకు ఖాతాలు లేవని, వీరందరికీ తక్షణమే జన్‌ధన్ ఖాతాలను తెరవాల్సి ఉందన్నారు. రోజువారీ లక్ష్యాలను నిర్ణయించుకొని, నెలాఖరులోగా ఖాతాలను తెరవాలని కోరారు. అవసరమైతే వెలుగు సిబ్బంది సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ బీమా పథకం పేద ప్రజలకు ఎంతో మేలు చేసే పథకమని, సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎట్టి పరిస్థితిలోనూ ఈ నాలుగు రోజుల్లోనే ఖాతాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైస్ కార్డుల పంపిణీలో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఖాతాలను పూర్తి చేయడం ద్వారా, ఈ అంశంలో కూడా ముందంజలో ఉండాలని కోరారు.
అంతకుముందు డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో 6,85,000 మందికి బియ్యం కార్డులు మంజూరు కాగా, ఇప్పటికే వీరిలో సుమారు 5,85,000 మందికి కార్డుల పంపిణీ పూర్తి చేయడం జరిగిందన్నారు. రైస్ కార్డు ఉన్నవారందరికీ వైఎస్ఆర్ బీమా పథకాన్ని వర్తిస్తుందన్నారు. బ్యాంకు ఖాతాలు తెరవడంలో, బ్యాంకర్లనుంచి ఎదురవుతున్న సమస్యలను వివరించారు. జన్‌ధన్ ఖాతాలు తెరిచేందుకు కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని చెప్పారు. ఖాతాలను తెరిచేందుకు వెలుగు సిబ్బంది పూర్తిగా సహకరిస్తారని, ధరఖాస్తులను పూర్తిగా నింపి, బ్యాంకులకు తీసుకువస్తారని చెప్పారు. అలాగే బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లు, బీమా మిత్రల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. మెప్మా పిడి కోట్ల సుగుణాకరరావు మాట్లాడుతూ బ్యాంకుల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. చిరువ్యాపారులను ప్రోత్సహించేందుకు పిఎం స్వనిధి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనిక్రింద రూ.10వేలు రుణాన్ని ఇస్తోందని తెలిపారు. ఈ పథకం విజయవంతం చేసేందుకు బ్యాంకులు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.