శ్రీకాకుళం జిల్లాలో రక్తనిల్వలు చాలా అవసరమని, ఇందుకోసం అన్ని శాఖలు, స్వచ్చంద సంస్థలు ముందుకురావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పిలుపునిచ్చారు. రక్తదాతల స్ఫూర్తి హర్షణీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలతో రక్త దాతలకు సంతృప్తి లభిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లాలోని పశుసంవర్ధక శాఖలోని అందరు వైద్యులు, సిబ్బంది, అన్ని అసోసియేషన్ల వారితో రక్తదాన కార్యక్రమం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం పశుసంవర్ధక శాఖ శిక్షణ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదాతలను కలిసి అభినందించారు. రక్తదానానికి పురుషులతో పాటు స్త్రీలు కూడా పాల్గొనడం అభినందనీయమని, ఇందులో మహిళా వైద్యులు కూడా రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది మహిళలు రక్తదానానికి ముందుకు రావాలని కలెక్టర్ ఆకాక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అతి పొడవైన జాతీయ రహదారిలో జరిగే ప్రమాదాలు, తలసేమియా, ఇతర అవసరాల కోసం రక్తం చాలా అవసరమని, అందుకు తగినంత రక్తనిల్వలు లేవని అన్నారు. ఇందుకు రక్తదానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయగలిగితే కొంతమంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఈ రక్తదాన కార్యక్రమంలో సుమారు 86 మంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారని, ఇది శుభదాయకమన్నారు. అనంతరం రక్తదాతలకు కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను, మెడల్స్ లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం.కిశోర్,ఉప సంచాలకులు డా.ఎం.జగన్నాధరావు, ఐ.ఎస్.డి.పి సహాయ సంచాలకులు డా. పి.సూర్యం, ఆమదాలవలస, పొందూరు, నరసన్నపేట, సరుబుజ్జిలి, గార సహాయ సంచాలకులు డా. ఆర్.ఆనందరావు, డా. పి.ఎస్.జి. బాలకృష్ణ, డా. కె.రాజగోపాలరావు, డా. సిహెచ్. సుబ్రహ్మణ్యం, డా. జి.వి.రాజశేఖరం, ఇతర వైద్యులు, రెడ్ క్రాస్ సంస్థ ఎం.సి మెంబర్లు పి.శ్రీకాంత్, శ్రీధర్, పెంకి చైతన్య కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.