నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలోని గృహనిర్మాణ లబ్థిదారులకు రూ.35వేల బ్యాంకు లింకేజీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్ ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం కొమరగిరి లేఅవుట్‌లో గృహనిర్మాణ ప్రగతిపై అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావుతో కలిసి హౌసింగ్, ప్రత్యేకాధికారులు, ఇతరశాఖల అధికారులతో కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహనిర్మాణాల కోసం సుమారు 9,416 మంది అగ్రిమెంట్లు పూర్తి చేసుకోగా, 3,300 ఇల్లు గ్రౌండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి గృహనిర్మాణ లబ్థిదారులుగా ఉన్న 4,536 మంది గృహనిర్మాణ లబ్థిదారులకు రూ.35వేలు చొప్పున బ్యాంకు లింకేజీ ప్రక్రియ పూర్తయ్యిందని, మిగిలిన 5వేల మందికి త్వరితగతిన లింకేజి ప్రక్రియ పూర్తయ్యేలా బ్యాంకర్లతో చర్చించాలని సూచించారు. అలాగే ఎమినిటి కార్యదర్శులు జియోట్యాగింగ్‌తోపాటు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
సీవోలు కూడా ఈ అంశంపై నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గృహనిర్మాణాల ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు మాట్లాడుతూ గృహనిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నందున దీనిపై సంబంధిత వర్గాలన్నీ సమన్వయంతో పనిచేసి లక్ష్యసాధన దిశగా ప్రగతి సాధించాలన్నారు. ఇందుకోసం ప్రతీ 15 రోజులకు ఒకసారి సమీక్షించుకుంటూ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. సాంకేతిక పరమైన సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ డిఈ సత్యనారాయణరెడ్డి, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం. ఏసుబాబు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, మేనేజర్ కర్రి సత్యనారాయణ, పలువురు ప్రత్యేక అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.