ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత అత్యంత కీలకమైనదని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు చెప్పారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు గురువారం చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్నికలలో బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని ఇన్ఛార్జి కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి అధికారులు సంసిద్దంగా ఉండాలన్నారు. పి.ఓ.ల విధులు, పోలింగ్ సామగ్రి, ఎన్నికలముందు నిర్వహించాల్సిన ప్రక్రియ, బ్యాలెట్ బాక్సులు సీజ్ చేసే విధానంపై అధికారులు అవగాహన పొందాలన్నారు. బ్యాలెట్ పత్రాల వినియోగం, డిక్లరేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమన్నారు. ఎన్నికలలో పి.ఓ.లు బాధ్యతగా వ్యవహరించాల్సిన తీరుపై ఆయన అవగాహన కల్పించారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
బాపట్ల జిల్లా పరిధిలోని 13 మండలాలలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలననుసరించి పి.ఓ.లు, ఏ.పి.ఓ.లు విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. ఎన్నికల సామగ్రి తరలించడంలోనూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్ బాక్సుల వినియోగం, ఎన్నికలలో బ్యాలెట్ పత్రాల వినియోగం, డిక్లరేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలన్నారు. టెండర్ బ్యాలెట్ వంటి అంశాలపై అధికారులు అవగాహన కలిగివుండాలన్నారు. ఎన్నికల ముందు ఎన్నికల సామాగ్రి తరలింపు, ఎన్నికల తదుపరి బ్యాలెట్ బాక్సులు అత్యంత భద్రతల మధ్య తరలించాల్సివుందన్నారు. ఎన్నికల విధి విధానాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్.డి.ఓ. పి. సరోజిని, బాపట్ల ఆర్.డి.ఓ. జి. రవీందర్, పి.ఓ.లు, ఏ.పి.ఓ.లు, తదితరులు పాల్గొన్నారు.