వినియోగ దారుల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలిగించని పంచగవ్య ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆ రంగంలోని నిపుణులతో త్వరలో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం ఆమె అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, పంచగవ్య ఉత్పత్తుల్లో రసాయనాలు ఉపయోగించడం లేదన్నారు. వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమనే విషయంపై అర నిముషం , నిముషం నిడివిగల కాన్సప్ట్ ప్రకటనలు తయారు చేయాలన్నారు. ప్రసార,ప్రచార సాధనాలు,సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమల ,తిరుపతికి వస్తున్నందువల్ల టీటీడీ సత్రాలు , రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ , వివిధ ఆలయాల వద్ద హోర్డింగులు ఏర్పాటుచేసి పంచగవ్య ఉత్పత్తుల వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహనకల్పించాలన్నారు .
పంచగవ్య సోపులు,షాంపులు, పళ్ళపొడి, ముక్కులో వేసుకునే చుక్కలు తదితర ఉత్పత్తుల్లో డిమాండ్ ఉన్న వాటిని గుర్తించి వాటి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సదా భార్గవి అధికారులకు సూచించారు. ఎస్వీ బీసీ, టీటీడీ వెబ్సైట్ లో కూడా ఇందుకు సంబంధించి ప్రచారం చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేస్తున్న అగరబత్తులకు విశేష స్పందన వస్తోందని ఆమె వివరించారు. త్వరలోనే రెండవ యూనిట్ ఏర్పాటు చేసి ఎక్కువ మందికి అగరబత్తులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేస్తున్న దేవతా మూర్తుల ఫొటోలు,కీచైన్లు, పేపర్ వెయిట్లు తదితర ఉత్పత్తుల గురించి కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేలా ప్రచారం చేయాలన్నారు.
ఎస్వీ ఆయర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, గోసంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, డిప్యూటీ ఈవో గుణభూషణ రెడ్డి , అదనపు ఎఫ్ ఎసి ఎవో శ్రీ రవిప్రసాద్,ఐటి జనరల్ మేనేజర్ సందీప్ ,ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి రామరాజు,పంచగవ్య ఉత్పత్తుల విభాగం ఎఈవో శ్రీనివాస్ , డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు.