సనాతన హిందూధర్మం, భారతీయ సంస్కృతికి సంబంధించి టీటీడీ ప్రచురిస్తున్న పుస్తకాలు నేటితరం వారికి కూడా సులువుగా అర్థమ య్యేలా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథరెడ్డి సూచించారు. టీటీడీ ప్రచురణల విభాగం కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన జేఈవో సదా భార్గవి తో పాటు పలువురు ప్రముఖ సాహితీవేత్తలు,పండితులతో సమావేశం నిర్వహించారు. వివిధ భాషల్లో టీటీడీ ప్రచురిస్తున్న పురాణాలు, గ్రంథాలు, హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని మంత్రి అభినందించారు. ఇంతటి గొప్ప పని టీటీడీ మాత్రమే చేయగలుగుతుందని అన్నారు. ఇలాంటి గ్రంథాలలోని భాషను సరళీకరించి ప్రతి ఒక్కరికీ సులువుగా అర్థమయ్యేలా ప్రచురించాలని కోరారు. దీనివల్ల మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుందన్నారు. డిజైన్, కంటెంట్ ప్రజెంటేషన్ , అర్థ,తాత్పర్యాలు చెడిపోకుండా విషయాన్ని వాడుక భాషలో చెప్పడం వల్ల ప్రైవేట్ ప్రచురణ కర్తలకు పోటీగా టీటీడీ ప్రచురణలు విశేష ఆదరణ పొందుతాయని రాజేంద్ర నాథ రెడ్డి సూచించారు.
ముద్రణలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని ఆయన చెప్పారు. అనేక మంది ప్రముఖ సాహితీ వేత్తలు, పండితులు ఈ అంశంలో టీటీడీకి స్వచ్ఛందంగా సహకరించడానికి ముందుకు వచ్చారని మంత్రి తెలిపారు. టీటీడీకి వారి సలహాలు, సూచనలు ఇస్తారని, వీటిలో ఆచరణ సాధ్యమైనవి అమలు చేసి టీటీడీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమ న్నారు. ఈ సందర్భంగా పలువురు పండితులు సాహితీవేత్తలు, అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. జేఈవో సదా భార్గవి మాట్లాడుతూ, టీటీడీ ప్రచురణలను మరింతగా జనబాహుళ్యంలోకి, ముఖ్యంగా యువతకు చేరువ చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శ్రీవారి కళ్యాణోత్సవాలు, వైభవోత్సవాలు జరిగే ప్రాంగణాల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తామని తెలిపారు.
మంత్రి సూచించిన విధంగా విమానాశ్రయాల్లోని స్టాల్స్ లో టీటీడీ ప్రచురణలు అందుబాటులో ఉంచే ఆలోచన చేస్తామని చెప్పారు. 1200 దాకా పుస్తకాలు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామని, ఆడియో బుక్స్ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రముఖ సాహితీవేత్తలు, పండితులు లక్ష్మీనారాయణ, డాక్టర్ సుధ, పాతూరి నాగరాజు, సత్యమూర్తి, సుబ్రమణ్య శర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు విభీషణ శర్మ, సప్తగిరి పత్రిక ప్రధాన సంపాదకులు రాధా రమణ, సంపాదకులు చొక్కలింగం, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి రామరాజు, సప్తగిరి ఉపసంపాదకులు నరసింహాచార్య పాల్గొన్నారు. టీటీడీ వివిధ భాషల్లో ప్రచురించిన గ్రంధాలు, పుస్తకాలను ఈ సందర్భంగా పరిశీలించారు.