ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విశాఖపట్నం-విజయనగరం- శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ జైన్ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున , సీపీ సీహెచ్ శ్రీకాంత్ తో కలిసి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల తో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ , ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే చాలా భిన్నమైనవని, బ్యాలెట్ పద్దతిలో జరుగు ఈ ఎన్నికలకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థుల జాబితా ఖరారు అయినందున ఇకపై పోలింగ్ ఏర్పాట్ల పనులు పూర్తి స్థాయిలో ఎటువంటి సమస్యలు లేకుండా చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ నిభందనలు అభ్యర్థులు అందరూ పాటించేటట్లు అవగాహన కల్పించాలని తెలిపారు.
ఓటర్లు అందరూ ఓటు వేసేందుకు మంచి వాతావరణం కల్పించాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి వచ్చు ఫిర్యాదులను వెను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అభ్యర్థుల ప్రచారం కొరకు పొందు అనుమతుల సేవలు అన్ని ఒక్క చోటే ఏర్పాటు చేసి సత్వరమే మంజూరు చేయాలని ఆదేశించారు. ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థులు ఖరారు అయినందున పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని అన్నారు . ఓటర్లకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.