విజయనగరం జిల్లాలో శాసనమండలి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా ఎన్నికల నోడల్ అధికారులు చర్యలు చేపట్టాలని శాసనమండలి ఎన్నికల పరిశీలకులు సిద్ధార్ధ్ జైన్ ఆదేశించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్ధులందరికీ అనుమతుల విషయంలో సమాన అవకాశాలు కల్పించాలని, అభ్యర్ధులందరినీ ఒకేలా పరిగణించాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన అన్ని అనుమతులు ఒకేచోట ఇచ్చేందుకు సింగిల్‌విండో పద్ధతిని అనుసరించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల పరిశీలకులు సిద్ధార్ధ్ జైన్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల ఫిర్యాదులను పరిష్కరించేందుకు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రతి ఫిర్యాదుపై త్వరగా విచారణ జరిపి జాప్యం లేకుండా నివేదికలు ఇవ్వాలన్నారు.
బ్యాలెట్ పత్రాలు, బాక్సుల సరఫరాపై విశాఖలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సమన్వయంతో వ్యవహరించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల సంఘం పేర్కొన్న మేరకు ప్రవర్తన నియమావళి అమలు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సరిహద్దున ఒడిశా నుంచి అక్రమ మద్యం సరఫరాకు తావులేకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలను సమకూర్చుకోవాలని, పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. శాసనసమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు 37 మంది అభ్యర్ధులు బరిలో వునవ్నారని అందువల్ల పెద్ద సైజు బ్యాలెట్ వచ్చే అవకాశం వున్నందున ఆ మేరకు తగిన సైజుగల బ్యాలెట్ బాక్సులు సిద్దం చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.