గృహ నిర్మాణ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. మండల అధికారులతో బుధ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులు వేగవంతం కావాలని ఆయన అన్నారు. ఒక దశ నుండి మరో దశకు ప్రగతి త్వరితగతిన ఉండాలని ఆయన ఆదేశించారు. నిర్మాణాలకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇంజినీరింగ్ సహాయకులతో పక్కాగా సమీక్షించాలని ఆయన చెప్పారు. సామగ్రి అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. గృహ నిర్మాణాలలో సంతృప్తి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు గృహ రుణాలు ఇవ్వడం జరుగుతోందని, లక్ష్యాలు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు.
సొంత స్థలాల్లో నిర్మాణాలపై దృష్టి సారించాలని అన్నారు. సొంత స్థలాల్లో అనర్హత లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు చేయరాదని ఆయన స్పష్టం చేశారు. సొంత స్థలాల్లో రిజిస్ట్రేషన్ లకు డిమాండ్ సర్వే చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో రోజుకు కనీసం లక్ష మంది వేతనదారులు పనులు చేయాలన్నారు. మేట్, క్షేత్ర సహాయకులు వేతనదారులను సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారు. పాచిపెంట, గరుగుబిల్లి, పార్వతీపురం మండలాలు లక్ష్యాల సాధనలో మెరుగు పడాలని ఆయన సూచించారు. ప్రధాన మంత్రి జన ఔషది కార్యక్రమంలో నమోదుకు రానున్న మూడు రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సిబ్బంది సహకారాన్ని పొందాలని ఆయన స్పష్టం చేశారు. జన ఔషది కార్యక్రమంలో నమోదుకాని వారికి ఆరోగ్య శ్రీ లో వైద్య సేవలు పొందుటకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. రీ సర్వేలో భాగంగా సర్వే, సబ్ డివిజన్ విధిగా జరగాలని ఆయన ఆదేశించారు.
సంయుక్త కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ రీ సర్వే వేగవంతం చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్. కృష్ణా జి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ, జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జె. శాంతీశ్వర రావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, ఐటిడిఎ ఏపిఓ సురేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.