పట్టభద్ర, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పోలింగ్ / సహాయ పోలింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పట్టభద్ర, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై నిర్వహించిన మొదటి విడత శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పట్టభద్ర, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా పూర్తిస్థాయి శిక్షణ పొంది సమర్థవంతంగా నిర్వహించాలని పోలింగ్ / సహాయ పోలింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధులు సమర్ధవంతగా నిర్వహించాలన్నారు.
పరీక్షలకు ఎలా సిద్ధం అవుతామో అలానే ఎలక్షన్ సిబ్బంది ఎలక్షన్ నిర్వాహణ పుస్తకాలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలని, ఎన్నికల విధులను అతిక్రమించవద్దని పోలింగ్ అధికారులకు సిబ్బందికి సూచించారు. విధుల నిర్వాహణలో అనుమానాలు ఉన్నట్లయితే శిక్షణ తరగతులలో అడిగి నివృత్తి చేసుకోవాళ్లన్నారు. ఎన్నికలు యొక్క విధి విధానాలు, ఎన్నికల పత్రాలు నిర్వాహణ, బ్యాలెట్ బాక్స్ ఎలా ఓపెన్ చెయ్యాలి , ఎన్నికల అనంతరం ఎలా సీల్ వెయ్యాలి తదితర అంశాల గురించి గార తెహశీల్దార్ సుధాసాగర పోలింగ్ విధులలో పాల్గొనే సిబ్బందికి స్లయిడ్ షో ద్వారా వివరించారు.
జిల్లాలో పట్టభద్రలకు సంబంధించి 59 పోలింగ్ కేంద్రాలు, స్థానిక సంస్థల సంబంధించి 04 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అనుమానాలు ఉన్న మాస్టర్ ట్రైనర్లచే సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సీరియస్ గా తీసుకొని బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్, ఇతర పోలింగ్ మెటీరియల్ తో పాటు సదరు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన పొంది బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాల అవగాహన చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల అధికారులపై ఎలాంటి ఫిర్యాదు వచ్చిన సంబంధిత అధికారులపై తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డి ఆర్ ఓ రాజేశ్వరి, కొవ్వాడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళీకృష్ణ, అధికారులు, పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.