ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి ఈనెల 16 తేదీన జరిగే ఎన్నికలకు జిల్లాలో ప్రతిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, బందోబస్త్ ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. జిల్లాలో 49 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిలో 44 రెగ్యులర్ కాగా 5 ఆక్సిలరీ కేంద్రాలని తెలిపారు.
28 ప్రదేశాల్లో ఏర్పాటు చేశామని 21 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని చెప్పారు. అనకాపల్లి లో గల 194 పీఎస్ లో అత్యధికంగా 1393 మంది ఓటర్లు ఉండగా పరవాడ ఉక్కునగరంలో ఉన్న 203 పీఎస్ అత్యల్పంగా 85 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. జిల్లాలో 42,714 ఉన్నారని వీరిలో 28,370 మంది పురుషులు 14, 338 మంది స్త్రీలు కాగా ఇతరులు 6గురు ఉన్నారని వివరించారు. అనకాపల్లి నుండి కలెక్టర్ తో పాటు పాల్గొన్న పోలీస్ సూపరింటెండెంట్ గౌతమి సాలి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును గూర్చి తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు, చేపట్టిన ఇతర ముందస్తు భద్రతా చర్యలను గూర్చి చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ పి. వెంకటరమణ, సిపిఓ జి.రామారావు, జి ఎస్ వి ఎస్ అధికారి మంజులవాణి తదితరులు పాల్గొన్నారు.