అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ మల్లికార్జున స్పష్టం చేశారు. రు.100 కోట్లతో పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిఐఎస్ సదస్సుకు 26 దేశాల చెందిన 30 ఉన్నత పరిశ్రమల నుండి 8 వేల నుండి 9 వేల వరకు డెలిగేట్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. సదస్సు నిర్వహించడానికి 5 హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. మెయిన్ హాలు, రెక్టిఫికేషన్ హాలు, రిజిస్ట్రేషన్ హాలు, సీఎంఓకు ప్రత్యేకంగా ఒక హాల్ ఏర్పాటు చేశామన్నారు.
1వ తేదీ సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తి చేసి, రెండో తేదీన విద్యుత్ శాఖ ,రహదారులు భవనాలు, అగ్నిమాపక శాఖ అనుమతులతో డ్రైరన్ నిర్వహిస్తామని చెప్పారు. డెలిగేట్స్ కోసం 400 కార్లు, 500 రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. విశాఖపట్నం విశిష్టత, గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా బ్రోచర్లు ముద్రించామని, పర్యాటక ప్రాంతాల్లో గైడ్స్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎ.యు. ప్రాంగణంలో మూడు హెలిప్యాడ్స్ ఏర్పాటు చేయడమైనదని, సదస్సుకు వచ్చే వారికి విమానాశ్రయంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపి శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.