ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించినందుకు ఆ శాఖ అధికారులను అభినందించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.కొన్ని ప్రాంతాల్లో ఆడవారిలో ఉన్న రక్తహీనత, స్పందన దరఖాస్తులు, జలజీవన్ మిషన్, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, గ్రామ వార్డు సెక్రటేరియట్ల పనితీరుపై సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలలో జిల్లాని ముందు స్థానంలో ఉంచాలన్నారు.
మండలంలోని సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్పందన కార్యక్రమంలో ఎక్కువగా పారిశుధ్యం, విద్యుచ్చక్తి, సచివాలయాల పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నందున వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పనులు వేగవంతం చేస్తే మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, ఆర్డీవోలు చిన్ని కృష్ణ, జయరామ్, పిడి డిఆర్డిఏ లక్ష్మీపతి, జి.ఎస్.వి.ఎస్. ప్రత్యేక అధికారి మంజులవాణి, ఎస్డీసీ రమామణి, ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్ రావు, వ్యవసాయ అధికారి మోహన్ రావు మత్స్య శాఖాధికారి లక్ష్మణరావు, ఆర్ అండ్ బి ఈఈ రమేష్, వివిధ మండలాల ప్రత్యేక అధికారులు తాసిల్దారులు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.