ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి..
Ens Balu
2
గూనపాలెం
2020-09-26 18:37:53
సచివాలయానికి వచ్చిన ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సిబ్బంది కృషిచేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వార్డు సచివాలయ సిబ్బందికి సూచించారు. శనివారం స్థానిక 33వ వార్డులోని గూనపాలెం సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గూనపాలెం వార్డు సచివాలయం నుండి అందుతున్న సేవలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, ఇతర సమాచారం, లబ్ధిదారుల జాబితాలు ప్రజలకు అందుబాటులో ఉంచినదీ, లేనిది పరిశీలించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కోవిడ్ సందర్భంగా చేపట్టిన ఇంటింటి సర్వే చేసిన పరిస్థితిని తనిఖీ చేశారు. సర్వేలో ఏ ఒక్కరిని విడిచి పెట్టలేదని తద్వారా కోవిడ్ లేకుండా నిర్మూలించవచ్చని జిల్లా కలెక్టర్ అన్నారు. వైరస్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని సూచిస్తూ అనారోగ్యం బారిన ఉన్నవారు ఏ ఒక్కరూ ఇంటివద్ద ఉండరాదని అన్నారు. కొంతమంది కరోనా పరీక్షలకు ముందుకు రావడం లేదని వాలంటీర్లు, సిబ్బంది జిల్లా కలెక్టర్ కు తెలియజేయగా అటువంటి వారి వద్ద నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి సేవలు అవసరం లేదని వ్రాతపూర్వకంగా తీసుకోవాలని సూచించారు. తీవ్ర అస్వస్థతకు గురైన సమయంలో ఎటువంటి సహాయం అందే పరిస్థితి ఉండదని స్పష్టంగా వారికి తెలియజేయాలని అన్నారు. వాలంటీర్ల, సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు. వృత్తిలో సచివాలయంలో మంచి సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని, తద్వారా విధుల నిర్వహణలో సంతృప్తి కలుగుతుందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డు, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డు తదితర సేవలు అందించడంలో ఎటువంటి జాప్యం జరగరాదని ఆయన ఆదేశించారు. ఈ నాలుగు అవసరాలకు సంబందించే ఎక్కువ మంది సచివాలయానికి వచ్చే అవకాశమున్నందున, వారికి మెరుగైన సేవలు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో అందించాలని పేర్కొన్నారు. ప్రతి పథకానికి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారిని గుర్తించాలని అటువంటి జాబితాను సచివాలయం వద్ద ప్రదర్శించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. పథకాల అమలులో పారదర్శకత స్పష్టంగా ఉండాలని అదే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ వివరించారు. సచివాలయాల ఏర్పాటుతో ప్రజలకు అవసరమైన సేవలు వారి వద్దకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. సచివాలయాల్లోని పనిచేసే యువత అద్భుతమైన పనితీరును కనబరచి జిల్లాకు మంచిపేరును తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకట రావు , నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.