పరిశోధనలు రైతులకు ఉపయోగపడాలి..
Ens Balu
2
Srikakulam
2020-09-26 18:45:08
శ్రీకాకుళం జిల్లాలోని రైతులకు ఉపయోగపడే పరిశోధనలను శాస్త్రవేత్తలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ శాస్త్రవేత్తలకు పిలుపు నిచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శనివారం ఉదయం రాగోలులోని వ్యవసాయ పరిశోధన క్షేత్రంతో పాటు పలు మండలాల్లోని పంటల స్థితిగతులను సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ భూములకు అనువైన వరి పంటలను రైతులకు సూచించాలని అన్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే పంటలపై దృష్టిని సారించాలని చెప్పారు. చీడపీడలను తట్టుకునే వరి వంగడాలను రైతులు వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులు మరియు మిల్లర్లస్థాయిలో ఆమోద యోగ్యమైన వరి రకాలు రైతులు పండించుకునేలా చూడాలని సూచించారు. అనంతరం ఉల్లికోడు, సుడిదోమపై పరిశోధన క్షేత్రాలను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ పరిశోధన అధికారి పి.వి.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, డా. యస్.వి.యస్.నేతాజీ, శాస్త్రవేత్తల బృందం, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.