ఆంధ్రరాష్ట్ర సాధనకోసం ఆమరణ నిరాహాదీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి, మహాపురుషుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషిచేసిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని జిల్లా కలెక్టరు డా. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాజమం డ్రి జిల్లా కలెక్టరు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను పురష్కరించుకొని కలెక్టరు మాధవీలత, జిల్లా అధికారులతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం అహర్నిషలు కృషి చేసి ఆంధ్రరాష్ట్ర ఆవిర్భానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. ఆంధ్రుల చిరకాల స్వప్నమైన రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగంతో అమరజీవియైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. శ్రీరాములు చేసిన త్యాగం ఫలితంగా దేశ వ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భావానికి కారణం అయిందని, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ప్రయోజనం పొందారని వివరించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 న జన్మించి 1952 డిసెంబరు 15న అమరులయ్యారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవి ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం 1956 నవంబర్1 న ఏర్పడిందని అన్నారు. అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు అడుగుజాడలలో నడవాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో జి. నరశింహులు, సీపీఓ కె.ప్రకాష్ రావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ ఈ డి.బాలశంకర్ రావు , డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, డి ఎల్ డిఓ వీణాదేవి, డివిజనల్ పిఆర్వో యం. లక్ష్మణాచార్యులు, కలెక్టరేట్ ఏఓ భీమారావు, జిల్లా అధికారులు , కలక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.