తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 20 నుండి 28వతేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
ఆలయానికి పరదాలు విరాళం..
శ్రీ కోదండరామాలయానికి శుక్రవారం హైదరాబాదుకు చెందిన ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు 5 మరియు తిరుపతికి చెందిన శ్రీ మణి 4 పరదాలు, కురాళాలు, కర్టన్లను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు నాగరత్న, గోవింద రాజన్, ఏఈవో మోహన్, సూపరింటెండెంట్ రమేష్, ప్రధాన అర్చకులు ఎపి.ఆనందకుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, చలపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.