చెన్నై గూడూరు సెక్షన్ పరిధిలోని రైల్వే లైన్ మధ్య రైలు రాకపోకల వేగం గంటకు 110 కిలోమీటర్ల నుండి 130 కి.మీ కు పెంచిన నేపథ్యంలో మానవ సహిత లెవెల్ క్రాసింగ్ లను మూసివేసి వాటికి ప్రత్యామ్నాయ సబ్ వే, అండర్పాస్ ఏర్పాటు పై దక్షిణ రైల్వే డివిజినల్ ఇంజనీర్, చెన్నై జంషీర్, జిల్లా ఆర్ అండ్ బి అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ నారాయణ తో కలిసి శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా దక్షిణ రైల్వే డివిజనల్ ఇంజనీర్ కలెక్టర్ గారికి వివరిస్తూ నాయుడుపేట విన్నమాల రైల్వే లెవెల్ క్రాసింగ్ నంబర్ 78, తడ మండల పరిధిలో పూడి ఎల్ సి నెంబర్ 48, సూళ్లూరపేట పట్టణ పరిధిలోని ఎల్సి 60 లను మూసి వేస్తూ ప్రత్యామ్నాయ అండర్ పాస్ సబ్వే ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సహకారం కావాలనీ జిల్లా కలెక్టర్ ను కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి నాయుడుపేట విన్నమాల ఎల్ సి నం.78 మరియు తడ ఎల్సి 48 పూడి గ్రామం పంచాయతీ రోడ్ కు సంబంధించి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి సంబంధిత తాసిల్దార్ రైల్వే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సబ్ వే/ అండర్ పాస్ ఏర్పాటు ప్రజలకు అనుకూలంగా ఉండేలా ప్రతిపాదనలు, నిర్మాణ చర్యలు ఉండాలని అన్నారు.
సూళ్లూరుపేట పట్టణంలోని మానవ సహిత ఎల్సి 60 మూసివేయుటకు సంబంధిత మున్సిపల్ కమిషనర్, ఆర్డిఓ సూళ్లురుపేట, తాసిల్దారు రైల్వే అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి అప్రోచ్ రహదారి మరియు అండర్పాస్ ఏర్పాటు కొరకు అంచనాలు ప్రతిపాదనలు ప్రజలకు ఇబ్బంది కలిగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా చెన్నై గూడూరు సెక్షన్ పరిధిలోని రైళ్ల వేగం 130 కిలోమీటర్లకు పెంచడం వలన ప్రాణ, ఆస్తి నష్టం ప్రమాదాలు సంభవించకుండా ఉండటం కొరకు మానవ సహిత లెవెల్ క్రాసింగ్ ల మూసివేత జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. దీని కొరకు జిల్లా యంత్రాంగం నుండి సంపూర్ణ సహకారం అందిస్తామని అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా అండర్పాస్/ సబ్ వే ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.