బాలల హక్కుల పరిరక్షణే లక్ష్యం..
Ens Balu
4
Vizianagaram
2020-09-26 20:05:29
బాలల హక్కుల పరిరక్షణ దిశగానే వారికి కౌన్సిలింగు గదులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. నగరంలోని ధర్మపురి ప్రాంతంలోని బాలల న్యాయ మండలి, బాలల సంక్షేమ సమితి(జువెనైల్ కోర్టు) ప్రాంగణంలో శనివారం కౌన్సిలింగు గదులను ప్రారంభించి, ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీజీ విగ్రహాన్నిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆవిష్కరించారు. బాల నేరస్థుల సంక్షేమ, పరివర్తన శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ చట్టంతో విభేదించిన పిల్లలు, రక్షణ, సంరక్షణ అవసరం ఉన్న పిల్లలను వారిని శిక్షించడం ద్వారా మాత్రమే కాకుండా కౌన్సిలింగు ద్వారా వారి నేరప్రవృత్తిని మార్చి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. పిల్లల పరివర్తనే ధ్యేయంగా బాలల సంక్షేమ సమితి, బాలల న్యాయమండలి పనిచేయాలని సూచించారు. చైల్డ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సహకారంతో కౌన్సిలింగు గదుల నిర్మాణానికి సహకరించిన స్థానిక హెల్పింగ్ హేండ్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి రాజవర్మను అభినందించారు. బాలల సంక్షేమం కోసం స్వచ్ఛందసంస్థలు ముందుకు రావాలని కోరారు. జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ శాఖకు చెందిన జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ పి.బాలప్రభాకర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి.లక్ష్మీరాజ్యం, బాలల న్యాయమండలి ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ బి.శిరీష, బాలల సంక్షేమ సమితి ఛైర్మన్ వి.లక్ష్మణరావు, బాలల న్యాయమండలి సభ్యులు కరణం జనార్దన్, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యులు కేశలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.