రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తోన్న జగనన్న గోరుముద్ద మెనూలోకి మరో పోషకాహారం రాగి జావను చేర్చడం జరిగిం దని, ఇకపై వారంలో మూడుసార్లు రాగి జావను విద్యార్థులకు అందించనున్నట్లు రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జగనన్న గోరుముద్దలో భాగంగా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పథకం క్రింద రాష్ట్రంలోని 44,392 పాఠశాలల్లో గల 38 లక్షల విద్యార్ధులకు రుచికరమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో మాదిరిగా కేవలం అన్నం, సాంబారు కాకుండా వారంలో 15 రకాల మెనూతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గ్రుడ్లు, ౩ రోజులు బెల్లం, పల్లీ చిక్కీలు ఇస్తున్నామని అన్నారు. మిగిలిన 3 రోజుల్లో కూడా పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించి రక్తహీనతను నివారించేందుకు వీలుగా జగనన్న గోరుముద్దలో రాగిజావను కూడా చేర్చడం జరిగిందని వివరించారు.
ఇందుకోసం శ్రీ సత్యసాయి ట్రస్టు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని, ట్రస్ట్ రూ.42కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.44కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని 1 నుంచి 10 వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్ధులకు అమలు కానుందన్నారు. గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకం క్రింద ఏడాదికి రూ.450కోట్లు వెచ్చిస్తే, ప్రస్తుతం నాణ్యమైన, పౌష్టికాహారం కోసం రూ.1824కోట్లు వెచ్చిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. వీడియోకాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో 2,572 పాఠశాలలుండగా అందులో 1,77,664 మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజన పథకం వినయోగించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గోరుముద్ద్ పథకంలో బెల్లం కలిపిన రాగి జావను కూడా చేర్చడం వలన విద్యార్ధుల్లో ఐరన్, కాల్షియం కలిగి రక్తహీనత లేకుండా ఉండేందుకు ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా.ఆర్.జయప్రకాష్, శ్రీకాకుళం శ్రీసత్యసాయి ట్రస్ట్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.