కమాండ్ కంట్రోల్ రూమ్ పునరుద్దరణకు చర్యలు


Ens Balu
10
Kakinada
2023-03-25 12:31:37

ఇంటిగ్రేటెడ్ క‌మాండ్‌, కంట్రోల్ సెంట‌ర్ (ఐసీసీసీ) కార్య‌క‌లాపాల పున‌రుద్ధ‌ర‌ణ‌, నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారులకు సూచించారు. శ‌నివారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధ్య‌క్ష‌త‌న కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్ (కేఎస్‌సీసీఎల్‌) 37వ డైరెక్ట‌ర్ల బోర్డు స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ విస్తృత ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని సీసీటీవీల ద్వారా నిఘా, ప‌బ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్ట‌మ్ వంటి ముఖ్య‌మైన కార్య‌క‌లాపాలు క‌మాండ్‌, కంట్రోల్ సెంట‌ర్ ద్వారా కొన‌సాగించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై నివేదిక రూపొందించాలన్నారు. ఇందుకు సంబంధించి అయిదుగురు స‌భ్యుల‌తో ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. స్మార్ట్‌సిటీ మిష‌న్ కింద చేప‌ట్టిన సైన్స్ సెంట‌ర్‌, క‌ళాక్షేత్రం, స్కేటింగ్ రింక్ ప‌నుల‌పైనా స‌మావేశంలో చ‌ర్చించారు. వీలైనంత త్వ‌ర‌గా వీటిని ప్రారంభించి, ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. స‌మావేశంలో కాకినాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్, కేఎస్‌సీసీఎల్ సీఈవో, ఎండీ కె.ర‌మేష్‌; స్వ‌తంత్ర డైరెక్ట‌ర్లు టీవీఎస్ కృష్ణ‌కుమార్‌, డా. జేవీఆర్ మూర్తి, డైరెక్ట‌ర్ సందీప్ కుల్హారియా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.