ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను జేఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. ఆలయం ఎదుట టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ వైట్ రైస్, వెజిటబుల్ పలావు, చట్ని, కేసరి, రసం, సాంబారు, పప్పు, వెజిటబుల్ కర్రీ భక్తులకు వడ్డిస్తున్నారు. పలువురు భక్తులను పలకరించి అన్నప్రసాదాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ టీటీడీ పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కళ్యాణ వేదిక దగ్గర భక్తులకు పంపిణీ చేసేందుకు పులిహోర ప్యాకెట్ల తయారీని పరిశీలించారు. కళ్యాణానికి విచ్చేసే భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, కుంకుమ, కంకణం, 2 చిన్నలడ్డూ ప్రసాదం, పులిహోర, వాటర్ బాటిల్ కలిపి తయారు చేసిన కిట్లను పరిశీలించారు. గ్యాలరీలోకి ప్రవేశించే ముందే భక్తులకు ఈ ప్రసాదం కిట్లను అందజేయాలని అధికారులకు సూచించారు.
జేఈవో వెంట టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, విద్యుత్ విభాగం ఎస్.ఇ వెంకటేశ్వర్లు, డిఇ చంద్రశేఖర్, ఇఇ సుమతి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి,విజీవో మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ తదితరులు ఉన్నారు.