డా|| బాబు జగ్జీవన్‌రామ్ అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి


Ens Balu
7
Tirupati
2023-04-05 15:36:03

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దేశానికి ఉప ప్రధానిగా ఎదిగిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్ సామాజిక అంత‌రాల‌ను తొల‌గించేందుకు ఎంత‌ గానో కృషి చేశార‌ని, వారి అడుగుజాడ‌ల్లో అంద‌రం న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని హైదరాబాద్ లోని ఉస్మానియా వర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లా డీన్ ఆచార్య గాలి వినోద్ కుమార్ కోరారు. జ‌గ్జీవన్‌రామ్ 116వ జయంతి వేడుకలను తిరుపతిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆచార్య గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ 52 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో త‌ర‌త‌మ భేదాలు లేకుం డా అంద‌రికీ విశేషంగా సేవ‌లందించిన అజాత‌శ‌త్రువు శ్రీ జ‌గ్జీవ‌న్‌రామ్ అన్నారు. పాఠ‌శాల వ‌య‌సులోనే రెండు కుండ‌ల విధానాన్ని వ్య‌తిరే కించార‌ని, రిజ‌ర్వేష‌న్‌లో వ‌చ్చే స్కాల‌ర్‌షిప్ కాద‌ని మెరిట్ స్కాల‌ర్‌షిప్ పొందిన మేధావి అని కొనియాడారు. కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రిగా దేశం లో హ‌రిత విప్ల‌వం తీసుకొచ్చి దిగుబ‌డులు పెంచిన ఘ‌నత వారికే ద‌క్కుతుంద‌న్నారు.
  

       అంతకుముందు టిటిడి అధికారులు శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా విశేష సేవ‌లందించిన ప‌లువురికి జ్ఞాపిక‌లు, వ్యాస‌ర‌చ‌న‌, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. కార్య‌క్ర‌మం మొద‌ట్లో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కళాకారుడు డా.ఎం.భిక్షు నాయక్ బృందం  ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ లోని ప్రభుత్వ సిటి కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డా.కోయి కోటేశ్వరరావు, తిరుపతి క్రైమ్ సిఐ  పి.సుమతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు  స్నేహలత, ఆనంద‌రాజు, జగదీశ్వరి, ఇఇ మ‌నోహ‌రం ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.