కోవిడ్ Xbb1.16 భారత దేశంలో కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి, రెండో వేవ్ లలో డెడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రిగా నిలిచిన విమ్స్ ను 100 పడకలతో సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన మాక్ డ్రిల్ ను విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ ను విజయవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటు న్నామన్నారు. అందులో భాగంగా కోవిడ్ రోగులకు అందించాల్సిన మందులు, ఆక్సిజన్ సరఫరాల ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తుగా నిల్వ చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం 100 పడకలను కేటాయించడం జరిగిందని అవసరం బట్టి వాటి సంఖ్యను 600 పడకల వరకు పెంచుకుంటూ వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 200 ఐసీయూ పడకలకు అందుబాటులోకి తీసుకునిరాగల సామర్థ్యం విమ్స్ ఆస్పత్రికి ఉందన్నారు.
విమ్స్ లో అందుబాటులో ఉన్న రెండు ఆక్సిజన్ ట్యాంకులు, రెండు ఆక్సిజన్ ప్లాంట్లు పరిశీలించి పని తీరును గమనించడం జరిగిందన్నా రు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. కోవిడ్ ను ఎదుర్కొన్నందుకు ఎవరు ఎవరు ఎటువంటి విధులు నిర్వర్తించాలి అనేది కేటాయించడం జరిగిందని అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో రోగులకు ఉత్త మ వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విమ్స్ ఆస్పత్రి ప్రస్తుతం సాధారణ రోగులకు ఉత్తమ వైద్యం అందించడంలో నిమగ్న మై ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేకంగా ఫీవర్ ఒపీను ఏర్పాటు చేయటం జరిగింది అన్నారు. అక్కడే రోగులకు పరీక్షించి కరోనా పాజిటివ్ అయితే కోవిడ్ వార్డుకు సాధారణ జ్వరం అయితే సాధారణ వార్డుకు తరలిం చడం జరుగుతుందన్నారు.