సీతంపేటలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ


Ens Balu
12
Seethampeta
2023-04-10 13:02:48

పార్వతీపురం మన్యం జిల్లా  సీతంపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లను ఐటీడీఏ పీవో  డాక్టర్ నవ్య, టీటీడీ అధికారులతో  కలసి సోమవారం ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ టీటీడీ స్వామివారి ఆలయాలు నిర్మిస్తోందని  తెలిపారు. ఇందులో భాగంగా గిరిజన ప్రాంతమైన సీతంపేటలో శ్రీవారి ఆలయాన్ని చక్కగా నిర్మించినట్లు చెప్పారు. మే 4వ తేదీ నుంచి ఇక్కడ భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభిస్తామన్నారు. ఆలయ సమీపంలోని కల్యాణ మండపాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పరిసర ప్రాంతాల భక్తులు  విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

      ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. మహాసంప్రోక్షణ అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాలని, కల్యాణ మండపాన్ని స్థానిక గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
     కార్యక్రమానికి వచ్చే అర్చకులు,ఇతర అధికారులు,సిబ్బంది, శ్రీవారి సేవకుల వసతి కోసం ఐటి డి ఎ అతిథి గృహం, పాఠశాలలు పరిశీలించారు. ఆతరువాత మన్యం జిల్లా రాజాం లోని శ్రీవారి ఆలయాన్ని జేఈవో ఇతర అధికారులు సందర్శించారు.  టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో గుణభూషణ్ రెడ్డి, ఎస్ ఈ (విద్యుత్ ) వెంకటేశ్వర్లు , విజివో మనోహర్, గిరిజన కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ సంధ్యా రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.