సమాజానికి మంచి చేయడమే నిజమైన పౌరసేవ


Ens Balu
9
Anakapalle
2023-04-21 13:39:51

ప్రభుత్వ అధికారులు నిస్వార్థంగా నిబద్ధతతో మంచి ఆలోచనలతో విధులు నిర్వహిస్తున్నందునే అభివృద్ధి సాధ్యపడుతున్నదని జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి తెలిపారు. శుక్రవారం సివిల్ సర్వెంట్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు సమాజానికి తోడ్పడే విధంగా అమలు చేయడంలో సివిల్ సర్వెంట్స్ ప్రతిభ ప్రతిఫలిస్తుందన్నారు. దేశ నిర్మాణం జాతి పురోగతికి బాటలు వేసేలా సమిష్టి కృషితో పనిచేసినప్పుడు ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరోనా సమయంలో సివిల్ సర్వెంట్స్ ప్రతిభ, సేవా భావం అందరికీ తెలిసిందన్నారు.

 అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ భాయ్ పటేల్ సివిల్ సర్వెంట్స్ గూర్చి మాట్లాడుతూ వారు "దేశానికి  స్టీల్ ఫ్రేమ్" అని అభివర్ణించారని చెప్పారు. తరువాత అదే తేదీని సివిల్ సర్వెంట్స్ డే గా జరుపు కుంటున్నట్లు చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన చట్టాలను సక్రమంగా అమలయ్యేలా సివిల్ సర్వెంట్స్ పర్యవేక్షిస్తారు అన్నారు.  జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు ప్రణాళిక అధికారి రామారావు, డ్వామా పిడి ఇ.సందీప్ దేశంలో సివిల్ సర్వెంట్స్ ప్రస్థానం, విజయాలను గూర్చి తెలియజేశారు. అనంతరం జిల్లా అధికారులతో జెసి ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు.