కీటక జనిత వ్యాదులపై అప్రమత్తంగా ఉండాలని ఐటిడి ఏ పిఓ వి. అభిషేక్ అన్నారు.మలేరియా నివారణ మనందరిపైనా ఉందన్నారు. మంగళవారం ప్రప్రంచ మలేరియా దినోత్సవం సందర్బంగా స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద మలేరియా నివారణపై అవగాహనా ర్యాలీని ఆ యన జెండా ఊపి ప్రాంభించారు. ఈ సందర్భంగా పి ఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మలేరియా నివారణ చర్యలపై అవగాహన కల్పిం చాలన్నారు. దోమల పెరుగుదలను అరికట్టడానికి డ్రైడేలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఇంటి పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడా నీటి నిల్వలు లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు.శుక్రవారం , సోమవారం, బుధవారాలలో డ్రైడే పాటించాలని స్పష్టం చేసారు. ఏదో ఒక పనిచేసామని కాకుండా క్రమశిక్షణతో పక్కాగా నివారణ చర్యలు చేపడితే ప్రజలను మలేరియా బారిన పడకుండా కాపాడవచ్చని అన్నారు. దోమ తెరల వినియోగంపై గిరిజనులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీని అంబేడ్కర్ కూడలి నుండి ఐటిడి ఏ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సాంబమూర్తి, వైద్య సిబ్బంది, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.