అధికారులూ మీకు అభినందనలు..
Ens Balu
2
Vizianagaram
2020-09-27 14:32:40
విజయనగరం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న 1134 సహాయకుల పోస్టుల భర్తీకి ఈనెల 20 నుండి 26వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహిం చిన రాతపరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. కోవిడ్ ప్రబలిన ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధుల ఆరోగ్య భద్రతకు అవసరమైన అన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించిన ఈ పరీక్షలకు జిల్లాలోని యువతీయువకుల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. జిల్లాలోని 88 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 45,575 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేయగా వారిలో 33,568 మంది పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన వారిలో 73.81 శాతం మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. 11,907 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరు కాలేదన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు వివిధ స్థాయిలకు చెందిన 4,600 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, దాదాపు వెయ్యి మంది వరకు పోలీసు సిబ్బందితో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పరీక్షలన్నీ సజావుగా, సమర్ధవంతంగా, ప్రశాంతంగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు. ఈ పరీక్షలు రాసేందుకు కోవిల్ లక్షణాలు ఉన్న అభ్యర్ధులను కూడా అనుమతించడం జరిగిందని, ఎనిమిది మంది కోవిడ్ లక్షణాలు ఉన్న అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ గదుల్లో వీరిని పరీక్షలు రాసేందుకు అనుమతించామని, ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా పి.పి.ఇ. కిట్లు ధరించిన కోవిడ్ వారియర్లను నియమించామన్నారు. దివ్యాంగులు పరీక్షలు రాసేందుకు వీలుగా 66 మంది దివ్యాంగ అభ్యర్ధులు పరీక్షలు రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లే అభ్యర్ధులకు వారి సొంత మండలం నుండి పరీక్ష రాసే మండలానికి ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడపడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగంలోని అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది సహకారం, సమన్వయంతో కూడిన సమిష్టి కృషి వల్లే ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తిచేశామని పేర్కొంటూ వారందరికీ అభినందనలు తెలిపారు.