ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు..


Ens Balu
13
Visakhapatnam
2023-05-05 11:20:02

మనమంతా ప్రజా సేవకులమని, ప్రజలను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పకుండా భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ అన్నారు. శుక్రవారం ఉదయం  కలెక్టరేట్‌లోని సమావేశ  మందిరంలో స్పందన ,రీ సర్వే, మ్యుటేషన్లు , భూ సేకరణ , యు ఎల్ సి భూములు తదితర రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ‌తో జాయింట్‌ కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్‌ మాట్లాడుతూ భూ హక్కు పత్రాల బదిలి ,  మ్యుటేషన్ కరెక్షన్  వంటి చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి ప్రజలు ఇంత దూరం వస్తున్నారంటే మండల లెవెల్ లో  సిబ్బంది  సరిగా పనిచేయడం లేదని  అర్థమవుతోందన్నారు. స్పందన అర్జీల్లో రీ రీఓపెన్ కాకుండా పరిష్కరించి , ఈ సంఖ్య పూర్తిగా తగ్గాలని ఆయన ‌ స్పష్టం చేశారు. టూరిజం ప్రాజెక్టులకు భూమి సమస్యలు లేకుండా వేగవంతం చేయాలనీ ఆదేశించారు .

ప్రభుత్వ భూములలో ఇండ్లు నిర్మించుకొని జీవో నెం. 388, 301 ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రస్తుతం ప్రభుత్వం కల్పించిన రిజిస్ట్రేషన్ , పట్టాలో మార్పులు , చేర్పులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు . పట్టాలు పొందినవారు, సగం డబ్బు కట్టిన వారు,  ఇంకా పూర్తిగా డబ్బు కట్టని వారిని తహసిల్దార్లు సచివాలయాల ద్వారా  ప్రోత్సహించి ధరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు. 150 చదరపు గజాల కు పైబడి యు ఎల్ సి భూములలో ఇండ్లు నిర్మించుకున్న యజమానులు ప్రభుత్వం నిర్దేశించిన రుసుములు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ధి పొందాలని అన్నారు. జిల్లాలో ప్రజలకు సంబంధించి పెండింగ్ సమస్యలలో భూములకు సంబంధించినవి అధికంగా ఉన్నాయని, స్పందన ద్వారా వచ్చే ప్రతి అర్జీను తహసీల్దార్లు , సర్వేయర్లు , వార్డు సచివాలయ సిబ్బంది  క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన అర్జీల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసే ప్రజల యొక్క సమస్యలను అత్యంత శ్రద్ధతో పరిష్కరించి జిల్లాను ముందు వరసలో ఉంచాలని అన్నారు.  మోచా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎస్ శ్రీనివాస్ మూర్తి, విశాఖపట్నం ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, భీమిలి ఆర్డివో భాస్కర్ రెడ్డి , ఎడి సర్వే విజయకుమార్ , ఎస్డీసీలు తహసీల్దార్లు ,  ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.