వైద్యఆరోగ్యశాఖలో అడ్డదారి నియామకాల విచారణ ఇప్పట్లో తేలదట


Ens Balu
135
Visakhapatnam
2023-05-28 05:04:37

విశాఖజిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అడ్డగోలుగా జరిగిన నియామకాలపై డిఎంహెచ్ఓ డా.పి. జగదీశ్వర్రావు కొత్త రాగం అందుకున్నారు. ఈ విచారణ ఇప్పట్లో తేలేదని, ఈ నోటిఫికేషన్ లో చాలా మంది, విభాగాలు ముడిపడి ఉన్నాయని అంటున్నారు. సా..గుతున్న విచారణపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. వాస్తవానికి అడ్డదాన జరిగిన ఈ నియామకాలు, చెల్లిస్తున్న జీతాలపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈవిషయంపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వరకూ ఫిర్యాదులు వెళ్లదడంతో జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున విచారణకు ఆదేశించారు. అయితే ఈ నియామకం తన హాయంలో జరగలేదని, అసలు ఎప్పుడు జరిగిందో తెలీదనీ, ఏ నోటిఫికేషన్ ద్వారా కూడా జరిగిందో తెలుసుకునే పని ప్రారంభించామని డిఎంహెచ్ఓ తీరిగ్గా సమాధానం ఇచ్చారు. మరోపక్క దొడ్డిదారిన నియామకాలు చేపట్టిన విషయంలో ఎవరో ఒక సిబ్బందిని బలిపశువుని చేసి విషయాన్ని మమ అనిపించే ప్రయత్నాలు ముమ్మరం చేశారని కూడా ఇదేశాఖలోని సిబ్బంది చెబుతున్నారు. 

విశాఖజిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అధికారులు, సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోవడం వలనే తెరవెనుక చల్లగా జరిగిన ఈ వ్యవహారం మీడియా ముందుకి.. ఆపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వరకూ వెళ్లింది. కాగా ఈ విషయంలో తాజా సమాచారాన్ని అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు చేరవేసే క్రమంలో ఈ అడ్డగోలు నియామకాలు, వ్యవహారం, విచారణపై వివరణ కోరిన ఈఎన్ఎస్ ప్రతినిధికి డిఎంహెచ్ఓ నుంచి వచ్చిన వింతైన సమాధానం ఆశ్చర్యాన్ని..అంతకంటె ఎక్కవ అనుమానాన్ని కలిగించింది. ఒక జిల్లాశాఖ అధికారి కాంట్రాక్టు ఉద్యోగాల నియమకాలు, నోటిఫికేషన్ విషయంలో జరిగిన అవకతవకలపై చిటికేస్తే సమాచారం టేబుల్ పైకి వచ్చి చేరుతుంది. అలాంటిది అసలు ఆ పారామెడికల్ ఉద్యోగ నియామకాలు ఏ నోటిఫికేషన్ ద్వారా జరిగాయో తెలీదని చెప్పడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదం వార్తల్లో ఉండే విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖ దొడ్డిదారిన అనధికారికంగా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిన వ్యవహరంలో జరిగిన నియామకాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. 

ఈ నోటిఫికేషన్ సమయంలో ఎవరెవరు(మినిస్టీరియల్ సిబ్బంది) సదరు సీట్లు చూస్తున్నారు..నియామక ప్రకటన ఏంటి.. ఆ సమయంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగా ఉన్నదెవరు, ఈ నోటిఫికేషన్ లో వున్న విభాగాల అధికారులు, సిబ్బంది ఎవరు, ఒక్కో పోస్టుకి రూ.2.50 లక్షల నుంచి రూ.3లక్షల వరకూ చేతులు ఎవరి ద్వారా మారాయి, ఇందులో ఎవరి వాటా ఎంత, ఎవరి ద్వారా ఈ విషయం బయటకు వచ్చి మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది, ఎవరిని కాపాడేందుకు విచారణ కాలయాపన చేస్తున్నారు, మరెవరిని బలిచేసేందుకు కార్యాచరణ సిద్దమైందనే విషయాలను కూడా ఈఎన్ఎస్ నేషన్ న్యూస్ ఏన్సీ ద్వారా త్వరలోనే బయటపెట్టేందుకు ఈఎన్ఎస్ నెట్వర్క్ టీమ్ రంగంలోకి దిగింది. అదే సమయంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఈ విచారణ ఇప్పుడప్పుడే తేలేది కాదన్న మాట వెనుక ఏం జరుగుతుంద నే విషయాన్ని కూడా కూపీలాగనున్నది. పెద్ద మొత్తంలో చేతులు మారిన విషయంలో ఇప్పటికే ప్రాధమిక సమాచారం అందుబాటులోకి వచ్చింది..దానిపై మరింత లోతుగా పరిశీలన చేస్తే అసలు విషయం కూడా వెలుగు చూసే అవకాశం ఉందని రెండు వర్గాల్లో ఒకటైన సిబ్బంది మీడియాకి లీకులివ్వడం కొసమెరుపు..!