గంగవరం పోర్టు ఉద్యోగులకు విద్యార్హతలను బట్టే జీతాలు


Ens Balu
6
Visakhapatnam
2023-06-08 13:09:24

గంగవరం పోర్టులో పని చేస్తున్న కార్మికులందరికీ వారి విద్యార్హతలను బట్టి సమానపనికి సమాన వేతనం చొప్పున ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు,  గంగవరం పోర్టు కార్మికులు,  కార్మిక సంఘాలు, పోర్టు యాజమాన్యంతో జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయి. గంగవరం పోర్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని ముందుగా ఆయన పిలుపునిచ్చారు. కార్మికులు, కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై పోర్టు యాజమాన్య ప్రతినిధుల నుండి వివరణ తీసుకున్నారు. కార్మికుల సమస్యలపై యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన  వివరణ ప్రకారం కార్మికులు అందరూ శాశ్వత ఉద్యోగులేనని, గంగవరం పోర్టు లిమిటెడ్ మరియు గంగవరం పోర్ట్ సర్వీసెస్ ఉద్యోగులకు ఒకే   విధంగా పరిగణిస్తామని తెలిపారు.  కార్మికులకు అందిస్తున్న  ప్రత్యేక అలవెన్స్  రెట్టింపు చేయాలని,  కార్మికుల విద్యార్హతలను పరిగణనలోనికి తీసుకొని  సాంకేతిక విద్యార్హతలు గల కార్మికులకు  స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించి  వారికి అదనంగా 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని  పోర్టు  యాజమాన్యాన్ని కలెక్టర్ ఆదేశించారు. 


 తొలగించిన కార్మికులను వారి నుండి వివరణ  తీసుకొని తిరిగి నియామకం  చేయాలన్నారు. బేసిక్ పే పెంపు అంశం ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని దాని గూర్చి ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.  కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించుటకు  ఈఎస్ఐ ఆసుపత్రుల్లోనే కాకుండా, ఇతర ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించుటకు  చర్యలు తీసుకోవాల్సిందిగా  పోర్టు యాజమాన్యానికి తెలిపారు. పోర్టు యాజమాన్యం సామాజిక బాధ్యతగా  పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచుటకు కృషి చేయాలన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ అనంతరం వచ్చే గ్రాట్యూటి వీలైనంత ఎక్కువ అందించేందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు.  కార్మికుల యూనియన్ బిల్డింగు  పోర్టు ఆవరణ బయట  నిర్మించుకొనుటకు నిధులు అందజేస్తామన్నారు. కార్మికులకు రుణాలు మంజూరు విషయమై  బ్యాంకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. పోర్ట్  యాజమాన్యం కార్మిక సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యలను  వారం రోజుల్లో  నివేదిక  సమర్పించాలన్నారు.

   కార్మికులకు సమస్యలు ఉంటే  నేరుగా కలెక్టరుకు  తెలియజేయవచ్చునని, పోర్టు సాధారణ  కార్యకలాపాలకు  కార్మికులు అంతరాయం కలిగించకూడదని,  యాజమాన్యంతో చర్చించి  మెరుగైన ఫలితాలను పొందాలని సూచించారు.   గాజువాక శాసనసభ్యులు  తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ  గంగవరం పోర్టు లిమిటెడ్  మరియు గంగవరం పోర్టు సర్వీసెస్  ఉద్యోగులను  ఒకే విధంగా పరిగణించాలన్నారు. 
కార్మికుల తరఫున  నొల్లి  తాతారావు, మాత అప్పారావు మాట్లాడుతూ   కనీస వేతనం అమలు, బేసిక్ పే పెంపు, జిపిఎస్, గ్రాట్యూటీ, డస్ట్ అలవెన్స్, కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, కార్మికులకు వైద్య సదుపాయం తదితర 11 అంశాల సమస్యలను తెలుపగా,  కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు నిలుపుదల చేయాలని,  పునరావాస  ప్యాకేజీ లో నియమితులైన  ఉద్యోగులు  శాశ్వతమా,  తాత్కాలికమా  వివరణ కావాలని, గంగవరం పోర్టు లిమిటెడ్ మరియు  గంగవరం పోర్టు సర్వీసెస్  సంస్థల ఉద్యోగులను ఒకే విధంగా పరిగణించాలని  కోరగా   ఆయా అంశాలపై   సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.జె.  రావు , సీనియర్  అడ్వైసర్ సాంబశివరావు , సిఈఓ బి.జి  గాంధీ, మాజి శాసనసభ్యులు పల్లా శ్రీనివాస రావు ,ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్, జనరల్ మేనేజర్ డిఐసి సిహెచ్  గణపతి,  లేబర్ డిప్యూటీ కమిషనర్ సునీత, డిసిపి ఆనంద్ రెడ్డి,  ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘ నాయకులు,  తదితరులు పాల్గొన్నారు .