విశాఖలో ఇద్దరు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి లతో భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. 11వ తేదీన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా విశాఖ పర్య టన షెడ్యూల్ ఖారారైంది. దేశ ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటరీ నియోజక వర్గ కేంద్రాల్లో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్న బీజేపీ ఒఢిశా బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదంతో కాస్త తగ్గింది. దీంతో మళ్లీ బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. అయితే గతంలో కన్నా ఈ సారి కాస్త తక్కువ మందితోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విశాఖలో నిర్వహించనున్న మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 11న ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు ర్యాలీగా వెళ్లి ఎయిర్ పోర్టులో సాదర స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రి 7గంటలకు నగరంలోని తాటిచెట్లపాలెం రైల్వే గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో పోర్ట్ సాగరిక కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా సమావేశమవుతారు. పోర్ట్ గెస్ట్ హౌస్ లో ఆరోజు రాత్రి బస చేస్తారు. సోమవారం ఉదయం వివిధ ఆలయాల సందర్శన అనంతరం ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. అమిత్ షా వెంట కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డితో పాటు వివిధ విభాగాల ఇన్ఛార్జిలు మురళీధర్, దేవధర్ సహా పలువురు ఎంపీలు హాజరు కానున్నారు.