నిత్యం సమాజ శ్రేయస్సుకోసం శ్రమించేది పాత్రికేయులే


Ens Balu
5
Visakhapatnam
2023-06-10 14:35:12

సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే పాత్రికేయుల పాత్ర సమాజంలో కీలకమైనదని జిల్లా ఇంచార్జి మరియు   రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు . శనివారం ఉదయం జగదాంబ జంక్షన్ దగ్గర డాల్ఫిన్ డయోగ్నస్టిక్ సెంటర్లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య శిభిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున , ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ  ఎన్ని కష్టాలు ఉన్నా జర్నలిస్టులు విలువల కోసం పని చేస్తారని, వారి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ డాల్ఫిన్ డయోగ్నస్టిక్ సెంటర్లో రూ.10,000 పైబడి ఖరీదు చేసే 56 రకాల అన్ని వైద్య పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా వైద్యపరీక్షల అనంతరం అవసరమయ్యే అత్యవసర చికిత్సను కూడా ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలో మరిన్ని నగరాల్లో జర్నలిస్టుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ  ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టు పాత్రను కొనియాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 495 మంది జర్నలిస్టులకు అక్రిడియేషన్ కార్డులను రెండు విడతలగా మంజూరు చేసినట్లు తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అక్రిడిటేషన్  కలిగిన 495  జర్నలిస్టులకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసుకొనుటకు డాల్ఫిన్ డయాగ్నస్టిక్స్ సంస్థ ఆధ్వర్యంలో వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజుకి సుమారు 30 మందికి సేవలు అందించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మంజూరు కాబడిన అక్రిడిటేషన్ కార్డుదారులందరూ ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్  స్కీమ్ కు సంబంధించి ఆరోగ్య భీమా మొత్తాన్ని సిఎస్ఆర్ నిధులనుంచి చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 

  భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్య, విద్య రంగాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు సమాజ చైతన్యం కోసం నిత్యం పనిచేస్తూ అనేక ఒత్తిడులు ఎదుర్కొంటారని అన్నారు.   జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులకు ప్రభుత్వ తరుపున  ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం 2023-24 సంవత్సరానికి నూతనంగా మంజూరు కాబడిన అక్రిడిటేషన్ కార్డులను అక్రిడిటెడ్  జర్నలిస్టులకు మంత్రి అందజేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన 300 మంది "వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్" సంబంధించి బీమా మొత్తం రూ.3,75,000/-   విలువగల చెక్కును జర్నలిస్టులకు అందజేసారు. జర్నలిస్టు హెల్త్  కార్డులను జర్నలిస్టులకు అందజేసారు.  అక్రిడిటేడ్   వర్కింగ్ జర్నలిస్టులకు రూ.10,000 పైబడి ఖరీదు చేసే 56 రకాల  వైద్య పరీక్షలను ఉచితంగా  అందిస్తున్న డాల్ఫిన్ డయాగ్నసిస్ సెంటర్ డా.వి.సురేష్, డా.లక్ష్మీ ప్రసూనలను ఈ సందర్భంగా  రాష్ట్రమంత్రి విడదల రజిని మరియు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం హెల్త్ చెకప్ కి సంబంధించి టెస్టుల వివరాల కరపత్రాన్ని మంత్రి జిల్లా కలెక్టర్ , ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎం.పి ఎంవివి సత్యనారాయణ, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, విఎమ్ఆర్డిఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు,ఆర్డీవో  హుస్సేన్ సాహెబ్, సమాచార శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి మణిరామ్ , కార్పొరేటర్లు , వైద్య సిబ్బంది, ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.