స్వచ్ఛ సర్వేక్షణ్-2023 లో ప్రథమ స్థానమే లక్ష్యం


Ens Balu
10
Visakhapatnam
2023-06-11 09:56:10

స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ప్రథమ స్థానమే లక్ష్యంగా నగర ప్రజల సహకారంతో సాధిస్తామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఆర్కే బీచ్ కాళీమాత గుడి నుండి సబ్మేరియన్ వరకు  1కె వాక్ జివిఎంసి కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, డిప్యూటీ మేయర్ జయ్యాని శ్రీధర్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో దేశములోనే విశాఖ నాలుగవ స్థానం సాధించిందని, అలాగే ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చి విశాఖ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం అడిగిన ప్రశ్నలకు ప్రజలు ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే నగర స్వచ్ఛతకు జివిఎంసి యంత్రాంగం ఎంతో కృషి చేస్తుందని అలాగే స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి ర్యాంకకు కృషి చేయాలన్నారు. విశాఖ నగరాన్ని పరిశుభ్రత నగరంగా తీర్చిదిద్దేందుకు “ఇకో-వైజాగ్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ప్రజల అవగాహన కొరకు 1కె వాక్ ప్రారంభించడం జరిగిందన్నారు. 

ముఖ్యంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నగరంలో పూర్తిగా నిషేధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి ప్లాస్టిక్ నిషేధంపై ఆదేశాలిచ్చారని, ప్లాస్టిక్ వలన కలిగే అనర్ధాలు ప్రజలందరికీ వివరించి ప్లాస్టిక్ బదులు ప్రత్యామ్నాయ వస్తువులైన క్లాత్ బ్యాగులను ఉపయోగించే విధంగా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. విశాఖ నగరంలో ఇప్పటికే నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలన అమల్లో ఉందని అయినప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు తక్కువ ధరకే దొరుకుతుందన్న నిషేధత ప్లాస్టిక్ ని వినియోగిస్తున్నారని వారి కొరకు ప్రత్యేక స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశామని ప్లాస్టిక్ కలిగి ఉన్న దుకాణదారుల నుండి భారీ స్థాయిలో అపరాధ రుసుం  వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 

  అనంతరం జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో విశాఖ నగరానికి మొదటి ర్యాంకే లక్ష్యంగా అందరి సహకారంతో సాధిద్దామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో “ఇకో-వైజాగ్” అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యంగా ప్లాస్టిక్ను నిర్మూలించవలసి ఉందని, వ్యాపారస్తులు ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలని, పచ్చదనం పెంపొందించడం, పారిశుద్ధ్యం, భూగర్భ మురుగనీరు, సేంద్రియ ఎరువు, పొల్యూషన్ వీటన్నిటిపై జివిఎంసి దృష్టి సారించి దేశంలోనే విశాఖ నగరాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో బృందం అడిగిన ప్రశ్నలకు ప్రజలు మంచి ఫీడ్ బ్యాక్  ఇవ్వాలన్నారు. విశాఖ నగరానికి ఎంతోమంది దేశ విదేశీయులు పర్యాటకులు, సందర్శకులు వస్తారని వారందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ప్లాస్టిక్ మరియు  పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు స్వచ్ఛభారత్ అంబాసిడర్లు, ఎన్జీవోస్,  స్వచ్ఛంద సంస్థలు, ఆర్డబ్ల్యూఎస్, నగర పౌరులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

 ముఖ్యంగా విశాఖ నగరానికి ఎంతో సువిశాలమైన తీర ప్రాంతం ఉందని ఎంతోమంది పర్యాటకులు వస్తారని అందుకు విశాఖ నగర తీరంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని, సముద్ర జలాలలో ప్లాస్టిక్ కలవకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. 1 కె వాక్ ద్వారా స్వచ్ఛత,  పారిశుధ్యం, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు నగరంలోని ప్రతి జోన్ పరిధిలో ప్రత్యేక  స్క్వాడ్ ఏర్పాటు  చేసామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జయ్యాని శ్రీధర్, జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు, డి సి ఆర్ పణిరామ్, కార్యదర్శి  నల్లనయ్య,  జోనల్ కమిషనర్లు, ఏఎంఓహెచ్, స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, స్వచ్ఛంద సంస్థలు నగర పౌరులు తదితరులు పాల్గొన్నారు.