ప్రజలకు సత్వరమే న్యాయం అందించాలనే లక్ష్యంతో కాకినాడ జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్ “ డయల్ యువర్ ఎస్పి” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ విషయాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాకి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా ఫోనుచేసి ఎస్పికి తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కలుగుతుంది. ప్రతి మంగళవారం ఉదయం 11 నుంచి 12 గం.ల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజలు 0884- 2371744 అనే నెంబరుకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు ఫిర్యాదుపై నేరుగా అధికారులతో అక్కడ నుండే ఫోన్ కాల్ లో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలు, వేధింపులు, బెదిరింపలు తదితర సమస్యలపై బాధితులు డయల్ యువర్ ఎస్పి కార్యక్రమంలో ఫిర్యాదుచేయవచ్చనన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్ కోరారు. ఈ పాత్రికేయ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పి అడ్మిన్ పి.శ్రీనివాస్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ సిహెచ్.రామ కోటేశ్వరరావు, ఐ.టి. కోర్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు, డిసిఅర్బి ఇన్స్పెక్టర్ పి.ఈశ్వరుడు, ఐ.టి. కోర్ ఎస్.ఐ. డి.రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.