పట్టణాలు, నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా ప్రగతి సాధించేలా స్టార్టప్స్, ఇంక్యుబేషన్ సెంటర్ల విస్తరణకు తగిన కృషి చేస్తున్నామని సీఐఐ యంగ్ ఇండియన్స్ చైర్ రాయ్ కొడాలి అన్నారు. విశాఖలోని వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో సీఐఐ యంగ్ ఇండియన్స్, భాగవతుల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం నాడు ఇంటర్‌ప్రైజింగ్ భారత్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో స్టార్టప్స్, ఇంక్యుబేషన్ సెంటర్లు నగరాల్లోనే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే వీటిని రూరల్ ప్రాంతాల్లో సైతం విస్తరించేలా, గ్రామీణ ప్రాంతాలకు ఏ విధంగా ఉపయోగపడాలనే అంశంపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.. గ్రామీణ, పట్టణ వ్యాపార పర్యావరణ వ్యవస్థల మధ్య విభజనను తగ్గించడం తమ ఉద్దేశమన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలను మరింత మెరుగ్గా తయారు చేసేందుకు దోహదపడుతుందన్నారు. భాగవతుల చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి, గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్ పౌండర్ శ్రీరామమ్మూర్తి మాట్లాడుతూ సాంకేతికత అందుబాటులోకి రావడంతో, భౌగోళిక సరిహద్దులు చెరిగిపోయాయన్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలు ఇప్పుడు వారి ఇంటి నుంచి ప్రపంచ మార్కెట్‌లను ప్రభావితం చేస్తున్నారన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఏపీఐఎస్ చైర్మన్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. యువ ప్రతిభను పెంపొందించడంలో స్టార్టప్, ఇంక్యుబేషన్ సెంటర్లు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.