గుర్రం జాషువా సేవలు మరువరానివి..
Ens Balu
8
Anantapur
2020-09-28 14:48:32
అద్భుతమైన రచనలతో సమాజాన్ని చైతన్య పరిచిన మహాకవి గుర్రం జాషువా అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గుఱ్ఱంజాషువా 125వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయం స్థానిక టవర్ క్లాక్ వద్ద గల గుర్రం జాషువా విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి మనిషి గౌరవించబడాలని మహాకవి గుఱ్ఱం జాషువా భావించేవారన్నారు. మహా కవులు రవీంద్రనాథ్ ఠాగూర్, షేక్స్పియర్ లాంటి ఎందరో గొప్ప కవుల సరసన గుర్రం జాషువా చేర్చ తగిన వ్యక్తిగా కొనియాడారు. మహాకవి కాళిదాసు రాసిన మేఘసందేశం జాషువా సాహిత్య ఆలోచనలకు అద్దం పట్టిందన్నారు. గబ్బిలం, ముంతాజ్ మహల్ ,ఫిరదౌసి ,బాటసారి, కాందిశీకుడు, తెలుగు తల్లి, బాపూజీ, క్రీస్తు చరిత్ర లాంటి ఎన్నో అద్భుతమైన రచనలు ఆయన వ్రాశారన్నారు. జాషువా కవిత్వం లో సృజనాత్మకత, అపురూపమైన భావాలు ప్రజలతో మమేకమై ఉంటాయన్నారు. యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప కవి గుఱ్ఱం జాషువా అన్నారు. జాషువా గొప్ప దేశభక్తుడని, స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన మహనీయుల పై కావ్యాలు వ్రాసినట్లు తెలిపారు. ప్రభుత్వం కూడా ఇలాంటి మహనీయుల త్యాగాలను గుర్తించి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదన్నారు. తన రచనల ద్వారా సమాజానికి జాషువా చేసిన సేవలను స్మరించుకోవడం, వారి యొక్క ఆలోచనా విధానాన్ని, సంకల్పాన్ని జిల్లా ప్రజలతో పాటు, యావత్ ఆంధ్ర జాతి స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు నడవాలని ఆయన అభిలషించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ పి వి ఎస్ ఎస్ మూర్తి , జాషువా సాహిత్య పీఠం అధ్యక్షులు ఆచార్య బాలసుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి నాగ లింగయ్య ఉపాధ్యక్షులు నాగేంద్ర , పూజారి ఈరన్న, ప్రొఫెసర్ సుధాకర్ ప్రముఖ కవి ఏలూరి వెంగన్న, వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.