వైఎస్సార్ జలకళతో 2లక్షల బోర్లు..
Ens Balu
4
Srikakulam
2020-09-28 14:54:58
రాష్ట్రంలో ఉచితంగా 2 లక్షల వ్యవసాయ బోర్లు వేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వై యస్ ఆర్ జలకళ కార్యక్రమంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే నాలుగు సంవత్సరాలలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయడం వలన 3 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని, 5 లక్షల ఎకరాలకు అందుబాటులోకి సాగు నీరు వస్తుందని ఆయన పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు మోటార్లు కూడా కల్పిస్తామని ఆయన తెలిపారు. ఇందుకు రూ.16 వందల కోట్లు అదనంగా ఖర్చు కాగలదని ఆయన అన్నారు. రైతులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేయలేని రైతులకు గ్రామ వాలంటీర్లు సహకారంతో దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించడం జరిగిందని చెప్పారు. బోర్లు వేయుటకు హైడ్రోజియాలజీ, జియో ఫిజికల్ సర్వే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. బోరు మొదటి సారి పడకపోతే రెండవ సారి కూడా ప్రభుత్వమే తవ్విస్తుందని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్ కు ఒక అడుగు ముందుకు వేస్తూ ఉచితంగా బోర్లు వేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రైతన్న జీవితంలో మార్పు రావాలనే ఆశయంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులకు గతంలో ప్రభుత్వం బకాయి పడిన మొత్తాన్ని చిరునవ్వుతోనే చెల్లించామని ఆయన అన్నారు. వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు బిగించడం వలన మోటార్లు కాలిపోవని అన్నారు. మీటర్లు వలన ఎక్కడ లోడ్ ఎక్కువగా ఉందో తెలుస్తుందని ఆయన వివరించారు. 30 సంవత్సరాల పాటు నాణ్యమైన విద్యుత్ రైతులకు అందించడం జరుగుతుందని అన్నారు. రాబోయే సంవత్సర కాలంలో జనతా బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. వై యస్ ఆర్ జలకళ కార్యక్రమం వలన రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని భైరి గ్రామానికి చెందిన యండి అసిరి నాయుడు అనే లబ్దిదారుడు చెప్పారు. అనేక సంవత్సరాలుగా పొలంలో బోరు వేయుటకు ప్రయత్నం చేస్తున్నామని, ఆర్థిక పరిస్థితి సహకరించక ఇప్పటికీ కలగానే ఉందని అన్నారు. వై యస్ ఆర్ జలకళ కార్యక్రమంతో కలలు సాకారమయ్యే రోజు వచ్చిందని ఆయన తెలిపారు. భావాజీపేటకు చెందిన పల్ల సూర్యనారాయణ అనే రైతు మాట్లాడుతూ వై యస్ ఆర్ జలకళ కార్యక్రమం రైతుల పట్ల వరం అన్నారు. వేల మంది రైతులకు అత్యంత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమం అన్నారు. ముఖ్యమంత్రి రైతు బాంధవుడు అని ఆయన చెప్పారు. రైతులకు ఏది ప్రయోజనకరమో పూర్తిగా తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కలకాలం సియంగా ఉండాలని తద్వారా రైతుకు, రాష్ట్రానికి మేలు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం జలకళ కు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు.