విజయనగరం జిల్లాలో ఈ నెల 2 నుంచి ప్రారంభం కానున్న డిపార్ట్‌మెంటల్ పరీక్షల నిర్వహణకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని, వివిధ శాఖల అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన ఛాంబర్‌లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి, పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని, అభ్యర్ధులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని కోరారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని, త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని, ప్రాధమిక చికిత్సా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎపిపిఎస్‌సి సెక్షన్ ఆఫీసర్ పి.ఢిల్లీశ్వరరావు మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణ విధివిధానాలను వివరించారు.
ఈ పరీక్షలు ఎపిపిఎస్‌సి ఆధ్వర్యంలో ఈనెల 2 వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆరు రోజులపాటు, స్థానిక సీతం కళాశాలలో జరుగుతాయని చెప్పారు. ఆబ్జెక్టివ్ పరీక్ష ఉదయం 10 గంటలు నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు జరుగుతుందని, డిస్క్రిప్టివ్ పరీక్ష పరీక్ష ఉదయం 10 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటలు వరకు జరుగుతుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు పరిక్ష రాసేందుకు ఆబ్జెక్టివ్ పరీక్షకు అదనంగా 40 నిమిషాలు, డిస్క్రిప్టివ్ పరీక్షకు 50 నిమిషాలు ఇవ్వాలని, స్క్రయిబ్‌లను అనుమతించాలని చెప్పారు. వీలైనంత వరకు గర్భిణులను క్రింద అంతస్తులోనే పరీక్ష రాయించాలని సూచించారు. పరీక్ష నిర్వహించిన తరువాత, జవాబు పత్రాల ప్యాకింగ్‌లో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ సూపరింటిండెంట్ దేవ్ ప్రసాద్, సిఐ గోపాలనాయుడు, ఎలక్ట్రికల్ డిఇ ధర్మరాజు, ఎపిపిఎస్‌సి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జె.చంద్రరావు, వివిధ శాఖల ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.