జాషువా రచనలు సమాజనిర్మాణానికే..
Ens Balu
5
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-28 15:00:48
సామాజిక మార్పుకు గుర్రం జాషువా రచనలు ఎంతో ఉపయుక్తంగా నిలచాయని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. వర్సిటీ పరిపాలనా భవనంలో సోమవారం ఉదయం నిర్వహించిన జాషువా జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం మహనీయులు చేసిన త్యాగాలు, కృషిని స్మరించుకోవాలన్నారు. విద్యను అందుకోవడం ద్వారా అభివృద్దిలో భాగస్వాములు కావడం సాధ్యపడుతుందన్నారు. దీనిని బలంగా విశ్వసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫీజురీయింబర్స్‌మెంట్, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రయాణం సంక్లిష్టమైనదైనా, లక్ష్యం దిశగా పనిచేసిన విధానం గుర్రం జాషువా నుంచి నేర్చుకోవాలన్నారు. సానుకూల దృక్పధాన్ని అలవరచుకోవడం ఎంతో అవసరమన్నారు. మన నడవడిక, వ్యక్తిత్వం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. శతాబ్ధ వేడుకలకు చేరువవుతున్న ఏయూ ప్రగతికి ప్రతీ వ్యక్తి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఏయూ ఎస్సీ,ఎస్టీ బోధన ఉద్యోగుల సంక్షేమ సంఘం అద్యక్షులు ఆచార్య పి.అర్జున్ మాట్లాడుతూ అసమానతలు రూపుమాపడానికి, సామాజిక మార్పుకు జాషువా రచనలు ఉపయుక్తంగా నిలచాయన్నారు. ఆచార్య టి.వెంకట క్రిష్ణ మాట్లాడుతూ నిమ్న వర్గాల జీవితాలను, జీవనాన్ని ప్రతిబింబిస్తూ జాషువా చేసిన రచనలు నిరుపమానమన్నారు. ఆయనకు ఏయూ కళాప్రపూర్ణను అందించిందని గుర్తుచేసారు.కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.వి రవీంద్రనాథ్ బాబు, డాక్టర్ ప్రసాద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.