కోవిడ్ తర్వాత వైద్యరంగంలో వివిధ దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని, ముఖ్యంగా యువకులు గుండెపోటుకు అధికంగా గురి అవుతున్నారని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున అన్నారు. అవి చాలా ప్రాణాంతకం గా మారుతున్నాయని చెప్పారు. దీనికి గల ఖచ్చితమైన కారణాలు కనుగొనడం కష్టంగా మారిందని ఆయన అన్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిందని అన్నారు. సోమవారం ఉదయం కేజీహెచ్ లో జరిగిన ఏ పి స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు నుండి 19 వరకూ 10 రోజుల పాటు సిహెచ్సీ, పిహెచ్సీ లలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ఏపి స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ కార్యక్రమం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను గుండె పోటు నుండి రక్షించి మరణాలను తగ్గించవచ్చని వివరించారు.
గుండెపోటు కారణంగా మరణాలను నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టెమీ ప్రాజెక్ట్‌గా దీన్ని ప్రారంభించిందని అన్నారు.
సుదూర ప్రాంతాలలో, గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాలలో ఈ.సీ.జీ చేయడం ద్వారా గుండెపోటును గుర్తించడానికి వైద్యులు శిక్షణ పొందుతారని మరియు కార్డియాలజీ విభాగంలోని కార్డియాలజిస్ట్‌కు సమాచారం పంపడం ద్వారా వైద్యులు చికిత్సను సూచిస్తారన్నారు . ఆ తర్వాత సీహెచ్‌సీ పీహెచ్‌సీ వైద్యులు గుండె రక్తనాళాల్లో క్లాట్ కరిగించే మందులు ఇంట్రావీనస్ ద్వారా ఇస్తారని, అడ్డంకులు తొలగిపోయి ఛాతీ నొప్పి తగ్గుతుందన్నారు . అనంతరం వారు రోగులను కెజిహెచ్ కార్డియాలజీకి పంపడం జరుగుతుందన్నారు. ఇది హబ్ మరియు స్పోక్ మోడల్ అని ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే తమిళనాడు, కేరళ, అస్సాం , జార్ఖండ్, మహారాష్ట్ర , గోవాలలో ఉందని తెలిపారు. టెర్షియరి సంరక్షణ ఆసుపత్రులకు దూరంగా ఉన్న రోగులలో గుండెపోటు కారణంగా మరణాలను ఆపడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు .